దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.

శుక్రవారం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో భీమవరం ఏ.యస్.ఆర్. నగర్ శ్రీ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రము నందు నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్థానిక శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు వ్యవహరించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు, శాసనమండలి సభ్యులు బొర్రా గోపీమూర్తి, రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్పర్సన్ పీతల సుజాత, ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ మరియు ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాజు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ పద్మనాధుని మురళీమోహన్, విశిష్ట అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి, తదితరులు పాల్గొననున్నారు. తొలుత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యాధికుడు అయిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేసి ఉపాధ్యాయ వృత్తికి ఎంతో వన్నే తెచ్చారన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరు వారి గురువులను, టీచరుగా ఉన్నవారు వారి గురువులను సత్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జాతి, దేశ నిర్మాణంలో ఉపాధ్యాయులు పాత్ర ఎంత కీలకమని అన్నారు. సినిమాలలో దయచేసి ఉపాధ్యాయులను వ్యంగంగా, తప్పుగా చిత్రీకరించవద్దని ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులను ప్రవర్తనలో ఆదర్శంగా తీర్చిదిద్దడం, చెడును, అజ్ఞానాన్ని తొలగించే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. విద్యార్థులలో చైతన్యాన్ని, అవసరమైతే దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసేలా పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలన్నారు. ఉపాధ్యాయులు పాత్ర తరగతి గదికే పరిమితం కాకుండా విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి దోహదపడాలన్నారు. ప్రపంచ స్థాయిలో ఉపాధ్యాయుల వృత్తి ఒక్కటే ఉన్నత గౌరవం పొందేదిగా ఉందన్నారు. విద్యార్థులకు మార్గదర్శకులుగా, సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉపాధ్యాయులు ఉండాలన్నారు. తల్లిదండ్రులు తర్వాత అంతే స్థాయిలో ఉపాధ్యాయులఫై గౌరవం ఉంటుందన్నారు. విద్యార్థి దశలో మంచి కన్నా చెడును త్వరగా గ్రహిస్తారని ఈ విషయాన్ని గమనించి మంచి మార్గం వైపు మళ్ళించాలన్నారు. ఉపాధ్యాయులందరూ గుర్తింపు పొందే స్థితిలో ఉండాలని, విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు విషయ పరిజ్ఞానాన్ని నేర్పించి వారు ఆకలింపు చేసుకునేలా తీర్చిదిద్దాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కొన్ని మాటలు ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు అయినా కూడా సర్వేపల్లి రాధాకృష్ణ టీచర్స్ డే పుట్టినరోజు అని అనుకుంటూ చేసుకొని వెళ్ళిపోతూ ఉండటం జరుగుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ 16 అణాల తెలుగు వ్యక్తి. “న్” చివర్లో ఉన్నప్పటికీ కూడా ఆయన సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు చెందిన తెలుగు హిందూ బ్రాహ్మణ కుటుంబంలో సర్వేపల్లి రాధాకృష్ణయ్యగా జన్మించారని తెలిపారు. పూర్వపు మద్రాస్ ప్రెసిడెన్సీ, ఉత్తర ఆర్కాట్ జిల్లాలోని తిరుత్తణిలో జన్మించారని తెలిపారు. చిన్నప్పుడు ఆయనకు పెట్టిన పేరు సర్వేపల్లి రాధాకృష్ణయ్య అని అన్నారు. వీరు ఎంత గొప్ప వ్యక్తి అంటే 1932 సంవత్సరంలోనే విద్యావ్యవస్థలో అప్పట్లో ఆయన చేపట్టిన మార్పులకి బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజుల్లో కింగ్ జార్జ్ -5 “నైట్ హుడ్” ప్రకటించడం జరిగిందన్నారు. మనకి భారతరత్న ఎలాగో బ్రిటిష్ ప్రభుత్వానికి నైట్ హుడ్ అటువంటిది అన్నారు. 1962లో ఆయన రాష్ట్రపతి అయి సమయానికి ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రారంభమైందని తెలిపారు. ఆయన గొప్ప టీచర్, మా అదృష్టం ఏంటంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాం ఆయన ఆ యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా పని చేశారన్నారు. అన్నిట్లో కన్నా ముఖ్యంగా వారు ఒక గొప్ప తత్వవేత్త, ప్రపంచానికి ఆయన గొప్ప ఫిలాసఫర్ అని తెలిపారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గురుపూజ మహోత్సవం టీచర్స్ డే సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఎంతో పవిత్రమైన దినం, గురువులు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మహోన్నతమైన వ్యక్తి ఆదర్శనీయులు అన్నారు. ఆదర్శ ఉపాధ్యాయులు, ఒక దౌత్య వేత్త ఉపరాష్ట్రపతిగా పనిచేసి అనంతరం రాష్ట్రపతిగా పనిచేసి విద్యావ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయులు పుట్టినరోజుని మనము ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న అందరికీ కూడా నాయొక్క నమస్కారాలు, ఉపాధ్యాయులు మూల స్తంభం వంటివారని, విద్యార్థికి జ్ఞానాన్ని అందించి సంఘంలో ఒక గౌరవనీయ వ్యక్తిగా తీర్చిదిద్దడంలో మీయొక్క పాత్ర అపారమైందన్నారు. విద్యార్థులకు కేవలం చదువు, జ్ఞానం మాత్రమే కాకుండా సమాజంలో జీవించడానికి కావలసిన సోషల్ స్కిల్స్, ధైర్యము, సహనం, ఓర్పు ఇలాంటి ఎన్నో లక్షణాల్ని మీ యొక్క అమూల్యమైన చేతుల మీదగా విద్యార్థులకు అందించి వారికి ఒక బంగారు భవిష్యత్తును, నూతన జనరేషన్ ని భారతదేశానికి అందిస్తున్న మీరు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. ఉపాధ్యాయులు గౌరవం ఎవ్వరు తీస్తే పోయేదికాదని, వారి గౌరవం ఎప్పటికీ ఉంటుందని, కాకపోతే 20 ఏళ్ల క్రితం పరిస్థితులు ఈరోజు లేవు సమాజం మారింది, ప్రజలు ఆలోచనలో, విద్యార్థులు, చిన్నపిల్లలు ఆలోచనలు మార్పులు వస్తున్నాయి. వారు ఏదైతే విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న కృషిని ఎప్పుడూ ఎవరూ తక్కువ చేయలేరని, ఏ మారుమూల కెళ్ళిన, ఏ ట్రైబల్ విలేజ్ కి వెళ్ళినా బ్రిడ్జి లేకపోవచ్చు గాని, స్కూల్ ఉంటుంది అక్కడ ఒక టీచర్ ఉంటారు, ఉపాధ్యాయుని మన దేశంలో కనిపించే దేవుని లాగా కొలుస్తాం. అది మన సంస్కృతి, మన సంస్కారం. అదే విదేశాలు అమెరికాలో అయితే అక్కడ పేరు పెట్టే పిలుస్తారు, అంత మహోన్నతమైన సంస్కృతిలో నుంచి వచ్చిన మనందరం గురువు అంటే ఆది గురువుగా పూజిస్తాం. తల్లిని మొదటి గురువు అంటాం, తర్వాత స్థానం గురువుదే అన్నారు. మీ యొక్క గౌరవం ఎల్లప్పుడూ ఉంటుందని, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ అత్యున్నత పొజిషన్లో ఉన్న వారు, ప్రైమ్ మినిస్టర్ దగ్గరనుంచి కింద వ్యక్తి వరకు ఉపాధ్యాయుని గౌరవించక తప్పదు, మీరు చేస్తున్న ఈ మహత్కార్యాన్ని, మహా ఉద్యమాన్ని పిల్లల్ని విద్యావంతుల్ని, ఒక ఉత్రుష్టమైన స్థితిలో పెట్టదానికి మీరు చేసే కృషిని మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నాను.
భీమవరం శాసనసభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనల్ని సరైన మార్గంలో నడిపించేది గురువు ఒక్కరే అన్నారు. ఆ గురువుకి మనమందరం కూడా శిరస్సు వంచి నమస్కరించాలన్నారు. గురువు అంటే దైవంతో సమానం, విద్యార్థికి సరైన నడకని బాటని వేసి మంచి సంస్కృతి సంప్రదాయాలను అలవర్చి ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దే గురువు పాత్ర చాలా అమోఘమైనదన్నారు. మీరు కూడా పిల్లలకి మంచి భవిష్యత్తును చూపించాలి గురువు అంటే దైవం అనే భావం కలిగే విధంగా మీరు ప్రవర్తించాలి. మేము చదువుకున్న రోజుల్లో ఉపాధ్యాయుడు ఎవరైనా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే గురువుగారు మీరు వెళ్ళటానికి వీల్లేదు ఇక్కడే ఉండాలని మేము చేతులు పట్టుకుని ఏడ్చేవాళ్ళం, అటువంటి ప్రేమను పొందేలా గురువు కూడా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలోనే ఉపాధ్యాయులుగా మంచి గుర్తింపు పొందుతారన్నారు. విద్యార్థులను ప్రభావితం చేసి ఉన్నత స్థాయికి తీసుకురాగలిగిన శక్తి ఉపాధ్యాయులలోనే ఉందన్నారు.
శాసన మండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి మాట్లాడుతూ గత సెప్టెంబర్ ఐదుకి ఒక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా పని చేస్తున్నటువంటి నేను ఈ రోజు అదే టీచర్స్ డే కి ఒక చీఫ్ గెస్ట్ గా శాసనమండలి సభ్యుడుగా ఇక్కడకే నిలబడే మాట్లాడుతున్నానంటే ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి నా ఉపాధ్యాయులు అందరూ కూడా నన్ను టీచర్లు ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు ఆ విధంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను. ఏదైతే సెప్టెంబర్ 5, 1988వ సంవత్సరంలో జన్మించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ ఒక తత్వవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయ వేత్తగా పేరు ప్రఖ్యాతలు గడిచారన్నారు.
రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ మన జీవితంలో మన విజయానికి మార్గం చూపినటువంటి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఈ రోజున టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీచర్ కి, స్టూడెంట్స్ కి మధ్య ఉన్న బంధం విడదీయరానిది, ఉపాధ్యాయులకు మాజీ అనేది ఉండదని, జీవితాంతం గుండెల్లో దేవుడులా ఉంటారన్నారు. కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులు బత్తి చేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ మాట్లాడుతూ విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి విద్యాశాఖ నిరంతర కృషి చేస్తున్నదని తెలిపారు. విద్యాశాఖలో జరుగుతున్న కార్యక్రమాలపై ఈ సందర్భంగా వివరించారు.
తొలుత బార్డోలి పాఠశాల, పి ఎస్ఎన్ బాలికల ఉన్నత పాఠశాల, రూట్స్ పాఠశాల, ఎ ఆర్ కె ఆర్ మున్సిపల్ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
చివరిగా విద్యారంగంలో విశేష కృషి చేసిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి పూలమాల వేసి, శాలువా కప్పి, మెమొంటో, ప్రశంసా పత్రం అందజేసి సన్మానించారు.
ఈ సమావేశంలో మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి పీతల సుజాత, సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాజు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళీమోహన్, శాసనమండలి సభ్యులు బుర్ర గోపి మూర్తి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కె. నాగేశ్వరరావు, కోపరేటివ్ చైర్మన్ నాగరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, సమగ్ర శిక్ష ఏపిసి పి.వై శ్యాంసుందర్, సహాయ సంచాలకులు సత్యనారాయణ, భీమవరం, తణుకు ఉప విద్యాశాఖ అధికారులు, మధ్యాహ్న భోజనం కోఆర్డినేటర్ కృష్ణారావు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది, ఉత్తమ ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.