Close

“దిత్వా తుఫాను” ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు తమ డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులకు అవగాహన కల్పించి సన్నద్ధత ఏర్పాట్లు చేయాలి. …జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 28/11/2025

శుక్రవారం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి ద్విత్వా తుఫాను ప్రభావంపై సన్నద్ధత, ధాన్యం కొనుగోలు ప్రగతి పై డిఆర్ఓ, ఆర్డీవోలు, తహసిల్దార్లు, డీఎస్ఓ, డిసిఓ, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దిత్వా తుఫాను కారణంగా రాబోయే మూడు రోజుల్లో జిల్లాలో వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. ప్రస్తుతం వాతావరణం బాగుందన్న ఆలోచనతో రైతులు ధాన్యం తరలింపులో అశ్రద్ధ చేయవద్దు అన్నారు. వర్షాల కారణంగా పంట నష్టం జరగకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయాలన్నారు. ప్రస్తుతం కల్లాలోపై ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు రైతులకు అవసరమైన టార్పాలిన్లు రైతు సేవా కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలని, టార్పాలిన్లు అందుబాటులో ఉన్న విషయాన్ని రైతు సేవాకేంద్రం పరిధిలోని ప్రతీ రైతుకు తెలియజేయాలన్నారు. అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద బరకాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ రైతుల ధాన్యం తడిచిపోకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
“మొంథా తుపాను” సందర్భంగా అధికారులు ఏ విధంగా సమన్వయంగా పనిచేశారో అదేవిధంగా దిత్వా తుఫాను ఎదుర్కొనేందుకు అదే విధంగా పనిచేయాలని అన్ని శాఖల అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తుఫాను సందర్భంగా అధికారులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయబడమన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి తెలియజేయాలన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్, డ్రైన్స్, ఆర్ అండ్ బి, పౌరసరఫరాలు, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ అధికారులు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

ధాన్యం కొనుగోలుపై మండలాల వారి నిర్దేశించిన లక్ష్యాల మేరకు జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. తుపాను కారణంగా రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు తరలించే సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సరిపడినన్ని గోను సంచులు రైతు సేవా కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. వర్షాలు కురియనున్న దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్.వెంకటేశ్వర్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.