తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని, ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యం, కందిపప్పు, పంచదార, బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఒక్కొక్క కేజీ చొప్పున, పామ్ ఆయిల్ ఒక లీటర్ చొప్పున మొత్తం కిట్ ల పంపిణీ నేటి నుండి ప్రారంభం
గురువారం పెంటపాడు మండలం రావిపాడులో వరద బాధితులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ చేతుల మీదుగా బియ్యం, నిత్యవసర వస్తువుల కిట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మొంథా తుఫాన్ నేపథ్యంలో గత ఐదు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి చివరి స్థాయి అధికారి వరకు తుఫాన్ పనులలో పూర్తిగా నిమగ్నమయ్యారని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తత చేయడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు శాయశక్తుల కృషి చేస్తారన్నారు. ప్రాణా నష్టం లేకపోయినా కొంతమేర ఆస్తి నష్టం, పెద్ద మొత్తంలో వరి పంట నష్టం జరిగిందన్నారు. రైతులు శ్రమించి పండించిన వరి పొట్ట దశలోనే నేలకు ఒరిగిపోవడం చాలా నష్టాన్ని మిగిల్చిందన్నారు. ప్రజలు జిల్లా యంత్రాంగం సూచనలు పాటిస్తూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తుఫాను బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవడానికి ముందు ఉందని, నేలకొరిగిన పంట పొలాల ఎన్యూమరేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగిందన్నారు.
తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి తుఫాన్ ముందస్తు హెచ్చరికలతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ప్రజలను సురక్షితంగా తుఫాను గండం నుండి గట్టెక్కించినందుకు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. రైతులు ఏ విధమైన ఆందోళన చెందవద్దని, తడిసిన ప్రతి గింజను కొనుగోలుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని తెలిపారు. పంట నష్టం ఎన్యుమరేషన్ పూర్తిగా గానే ప్రభుత్వానికి ప్రతిపాదించిన తర్వాత రైతులకు మేలు చేసేలా ఒక నిర్ణయం ఉంటుందన్నారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా తగిన న్యాయం చేస్తామన్నారు.
ఈ సందర్భంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల 11 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యం, కందిపప్పు, పంచదార, బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఒక్కొక్క కేజీ చొప్పున, పామ్ ఆయిల్ ఒక లీటర్ చొప్పున మొత్తం కిట్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, సివిల్ సప్లైస్ ఎం.డి ఎండి ఇబ్రహీం, తహసిల్దార్లు రాజరాజేశ్వరి, వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ చైర్ పర్సన్ ములగల శివ కేశవ, స్థానిక నాయకులు వలవల బాబ్జి, ఆకాశపు స్వామి, డాక్టర్ పద్మనాభుని మురళీమోహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.