తల్లి మరణిస్తే ఆ కుటుంబం అంతా ఎంతో ఇబ్బందులకు గురవుతుందని, జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా వైద్యులు అత్యంత అప్రమత్తతో చికిత్సలను అందజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు

శనివారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మాతృ, శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులు, బాధిత కుటుంబాల సమక్షంలో వైద్య సిబ్బందితో సమీక్షించడం జరిగింది. జిల్లాలో ఈ సంవత్సరం జూలై నెలాఖరు వరకు ఆసుపత్రులలో రెండు మాతృ మరణాలు, నాలుగు శిశుమరణాలు నమోదుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లి చనిపోతే పిల్లలు కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రసూతి వైద్యులు నిరంతరం గుర్తుంచుకోవాలన్నారు. ఏ తల్లి కూడా బిడ్డకు జన్మనిచ్చి చనిపోకూడదని, జన్మించిన ప్రతి బిడ్డ ఆరోగ్యవంతంగా పెరిగేందుకు వైద్యులు కృషి ఎంత అవసరమన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఆసుపత్రులలో అనేక మనకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని, డాక్టర్లను, వైద్య సిబ్బందిని నియమిస్తుందని వైద్యులు గర్భిణీ స్త్రీలకు రోగులకు సేవాభావంతో ఉన్నతమైన వైద్య సేవలు అందించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.గీతాబాయి, డి సి హెచ్ ఎస్ పి.సూర్యనారాయణ, జిల్లా ఇమ్యూ నైజేషన్ అధికారి డి.దేవసుధాలక్ష్మి, ఐసిడిఎస్ పిడి డి.లక్ష్మి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.కీర్తి కిరణ్, డిప్యూటీ డిఎంహెచ్వో వి.ప్రసాదరావు, డిపిఎమ్ఓ సిహెచ్ ధనలక్ష్మి, డి పి హెచ్ ఎన్ ఓ వెంకటరత్నం, పిల్లల వైద్యనిపుణులు డాక్టర్.ప్రవీణ్, గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి కళ్యాణి, డాక్టర్ పద్మజ, పిహెచ్సి వైద్యులు, కమిటీ సభ్యులు, ప్రైవేట్ డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.