తల్లిదండ్రులు లేని మానసిక బహుళ వైకల్యాలు కలిగిన బిడ్డల సంరక్షణకు చట్టపరమైన సంరక్షకత్వం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

గురువారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో నందు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ట్రస్ట్ యాక్ట్ పై ఏర్పాటుచేసిన సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ న్యూరో డెవలప్మెంటల్ రుగ్మత, మస్తిష్క పక్షవాతం, మానసిక మాంద్యం, బహుళ వైకల్యాలు కలిగిన బాలల సంరక్షణకు నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ద్వారా చట్టపరమైన సంరక్షకత్వం హక్కును కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా పనిచేసి ఏ విధంగా వారికి మంచి చేయగలము ఆలోచన చేసి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు . మానసిక వైకల్యం, బహుళ వైకల్యాలు ఉన్న పిల్లలను ఏ విధంగా పెంచాలి ఎటువంటి ఆహారం ఇవ్వాలి అనే అంశాలపై వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు లేకపోతే వారి సంరక్షణ బాధ్యత తీసుకునేందుకు ఈ కమిటీ లీగల్ గార్డియన్ షిప్ సర్టిఫికెట్ ను కమిటీ చైర్మన్ ఆమోదంతో జారీ చేసేందుకు సిఫార్సు చేయాలన్నారు. ఇప్పటికే రెండు దరఖాస్తులు లీగల్ గార్డియన్ షిప్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, నిబంధనలను మేరకు క్షుణ్ణంగా పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేయడానికి ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. సంబంధిత కమిటీ గురించి, కమిటీ ద్వారా చేపట్టే కార్యక్రమాల గురించి ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిటీని విధిగా సమావేశపరచాలని ఆదేశించారు.
జిల్లాలోని వివిధ కళాశాలలో రెగ్యులర్ గా చదువుకుంటున్న విభిన్న ప్రతిభావంతులైన బి.సౌమ్య, పట్టి దుర్గా వంశీ, సోర్రా పవను ముత్యాలు, రాటి పల్లి సాయిరాం, బాలా కరుణ ప్రశాంతి, గోగుల మండ వినోద్ కుమార్, గోపిశెట్టి సుభాష్ చంద్రబోస్ లకు ఒక్కొక్కటి రూ.38 వేలు ప్రభుత్వ వ్యయంతో కొనుగోలు చేసిన లాప్ టాప్ లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లాప్ టాప్ ల ద్వారా నైపుణ్యాన్ని పెంచుకొని, మంచి కోర్సులను అభ్యసించాలని, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు బాగా దోహదపడతాయని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సమావేశంలో కమిటీ మెంబెర్ కన్వీనర్ మరియు విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, కమిటీ సభ్యులు అంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిటేషన్ ప్రతినిధి ప్రసాద్, దివ్యాంగ మహా సంఘటన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ ఎస్ ఎస్ రమేష్, సైకాలజిస్ట్ జి.జేసెస్ ప్రసాద్ బాబు, సీనియర్ లాయర్ బి.సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.