జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో కలిసి భీమవరం పట్టణంలో ట్రాఫిక్ అవరోధాలను ద్విచక్ర వాహనాలపై ప్రయాణించి స్వయంగా పరిశీలన..
భీమవరం: నవంబర్ 25, 2025.
మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి భీమవరం పట్టణం అంతా స్వయంగా ద్విచక్ర వాహనంపై మూడు గంటల పాటు ప్రయాణించి క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ అవరోధాలను స్వయంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ బంగ్లా నుంచి ప్రారంభమైన ద్విచక్ర వాహన పర్యటన కాటన్ పార్క్, అడ్డవంతెన, అభిరుచి సెంటర్, బాంబే స్వీట్ సెంటర్, అంబేద్కర్ చౌక్, ప్రకాశం చౌక్, రిలయన్స్ సూపర్ మార్కెట్, పోలీస్ బొమ్మ సెంటర్, బస్టాండ్ సెంటర్, ఫ్లైఓవర్ డౌన్, యూటర్న్, కామాక్షి దేవి ఆలయం, బస్టాండ్ వెనుక సాయిబాబా ఆలయం మీదుగా, మావుళ్లమ్మ ఆలయం, తాలూకా కార్యాలయం, తిరిగి ప్రకాశం చౌక్ తో ముగిసింది. ఈ పర్యటనలో పోలీస్, మున్సిపల్, రవాణా, రహదారులు భవనాలు శాఖ అధికారులు కూడా అనుసరించారు. కాటన్ పార్క్ నుండి మావుళ్ళమ్మ దేవస్థానం వరకు రోడ్లు మార్జిన్ లో ఆక్రమణలు, ప్రకటన బోర్డులు, షాపుల యజమానులు రోడ్డు మార్జిన్ లో వస్తువులను ప్రదర్శించడం, వాహనాలు పార్కింగ్ గమనించిన జిల్లా కలెక్టర్ సంబంధిత షాపు యజమానులను పిలిచి గట్టిగా హెచ్చరించడంతోపాటు, మరొకసారి నిబంధన అతిక్రమిస్తే అపరాధ రుసుము తప్పదని గద్దించారు. పరిశీలిస్తున్న సమయంలో రోడ్డు పక్కన పెట్టి వెళ్లిపోయిన జీప్ కు రూ.5 వేలు, ఆటోకు ఫైన్ విధించాలని ఆదేశాలు జారీ చేశారు. బస్టాండ్ సెంటర్లో చికెన్ పాప్కార్న్ షాపు దాదాపు రోడ్డుకు ఆనుకుని నిర్మించడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత షాపు మీకు ఎవరికీ కనిపించటం లేదా, మీరు ఏం పరిశీలిస్తున్నారు అని మున్సిపల్ అధికారులను నిలదీశారు. నేను గుర్తించే వరకు మీరు గుర్తించరా, ముందే తొలగించాలని మీకు తెలియదా అని సహాయ టౌన్ ప్లానింగ్ అధికారిని గద్దించారు. సాయంత్రం లోపు తొలగించడం జరుగుతుందని ఏటీపీ కలెక్టర్ కు బదులిచ్చారు. భీమవరం పట్టణం జిల్లా ప్రధాన కేంద్రం అని విద్యావంతులు, విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు. ఎవరికివారు ఎక్కడపడితే అక్కడ పార్క్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇరుకైన రహదారులను మరింత ఇరుకుగా చేసేలా మన చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని సూచించారు. పట్టణంలో మావుళ్ళమ్మ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచిందని, షాపు యజమానులు దాదాపుగా రోడ్డు మీదకు వచ్చేలా వారి ఆక్రమణలు ఉండడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు, స్థానికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికే పలుమార్లు హెచ్చరించడం, సరి చేయడం జరిగిందన్నారు. ఇకనుండి నియంత్రణలో లేకపోతే ఏ విధమైన హెచ్చరికలు ఉండవని, చర్యలు మాత్రమే ఉంటాయని తెలిపారు. దేశవ్యాప్తంగా భీమవరంకు ఒక మంచి గుర్తింపు ఉందని, వివిధ ప్రాంతాల నుంచి భీమవరం వచ్చిన వాళ్లు ఇదేనా భీమవరం అనే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్నారు. ప్రజలు బాధ్యతగా ట్రాఫిక్ కు అంతరాయం లేని విధంగా నడుచుకోవాలి అన్నారు. ఎప్పుడైతే రవాణా సాఫీగా జరుగుతుందో అప్పుడు వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి అన్నారు.
జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలన్నారు. రోడ్డు మార్జిన్ లో అడ్డదిడ్డంగా వాహనాల నిలిపితే ట్రాఫిక్ ను ఎలా నియంత్రించగలమని ప్రశ్నించారు. అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, పోలీస్ సిబ్బంది నిరంతరాయంగా ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి కృషి చేస్తున్నారని వారికి సహకరించాలన్నారు.
మావుళ్ళమ్మ టెంపుల్ పరిసరాలను అంతరాయంగా పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటరీ వర్కర్లకు జిల్లా కలెక్టర్ చేతుల మీదగా పళ్ళబుట్టలను అందజేశారు.
ఈ పర్యటనలో భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డి.ఎస్.పి డాక్టర్ శ్రీ వేద, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, జిల్లా రవాణా అధికారి కె.కృష్ణారావు, తహాసిల్దార్ రావి రాంబాబు, టౌన్ సీఐ నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ ఏ.రాంబాబు, ఎంహెచ్ఓ సోమశేఖర్, ఏటీపీ ఎం.శ్రీలక్ష్మి, ట్రాఫిక్ సిఐలు, ఎస్సైలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పోలీస్, రెవిన్యూ, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.