Close

జిల్లా కలెక్టరేట్, రెవిన్యూ డివిజనల్ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 25/10/2025

“మంతా తుఫాన్” ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి

రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు.

తీరం దాటే సమయంలో గంటకు 90 – 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది

జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.

తుఫాన్ తీరం దాటే వరకు అత్యవసర పరిస్థితులలో మాత్రమే ప్రయాణాలు చేయాలి

జిల్లా అధికారులకు, సిబ్బంది సెలవులు రద్దు, 24/7 అధికారులు అందుబాటులో ఉండాలి.

శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి “మంతా తుఫాన్ ” ప్రభావాన్ని జిల్లా యంత్రాంగం సమర్థవంతం ఎదురుకునేందుకు ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తు సన్నాహక చర్యలపై రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “మంతా తుఫాన్ ” కారణంగా ఈనెల 26 నుండి 29 వరకు జిల్లాలో భారీగా వర్షాలు కురియనున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. 28వ తేదీ సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది అన్నారు. దీని ప్రభావంతో తీరం దాటే సమయంలో సుమారు గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎక్కడ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం యావత్తు మంతా తుఫాన్ తీరం దాటే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా జలమయమయ్యే లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను అవసరం మేరకు ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. తుఫాను దృష్ట్యా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సెలవులో ఉన్న డాక్టర్లు సెలవులు రద్దు చేసుకొని రేపటి నుండి విధులకు హాజరు కావాలన్నారు. నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను, వృద్ధులను గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశించారు. పునరావాస కేంద్రాల వద్ద అత్యవసరమైన మందులు, సిబ్బందిని ఉంచాలన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో రాబోయే వారం రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులను ఆయా ప్రాంతాలలో సిద్ధం చేసి ఉంచాలన్నారు. తుపాను కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా వారికి అవగాహన కలిగించాలని మత్స్య శాఖ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి ఒడ్డుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జిల్లాలో ఉప విద్యుత్ కేంద్రాల వద్ద ముందస్తుగా జనరేటర్లు, డీజిల్ సిద్ధంగా ఉంచుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు ముందస్తుగా బలహీనంగా ఉన్న కాలువ గట్లు, నదీ పరివాహక ప్రాంతం గట్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన ఇసుక బస్తాలు, సరుగుడు బాదులు సిద్ధంగా ఉంచాలన్నారు. ఈదురు గాలులు మూలంగా రోడ్లపై చెట్లు పడిపోతే సత్వరమే వాటిని తొలగించి రవాణాకు ఇబ్బందు లేకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు పారిశుద్ధ్య నిర్వహణ పక్కగా నిర్వహించాలని, త్రాగునీటి పైప్ లైన్ లు లీకేజ్ కారణంగా కలుషితం కాకుండా మర్మత్తులు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక శాఖ బోట్లు, లైఫ్ జాకెట్లు, నిల్వ ఉన్న నీటిని తోడేందుకు మోటార్ ఇంజన్లను, ట్రీ కటింగ్ మిషన్స్ ను, సిద్ధంగా ఉంచాలన్నారు. అధిక వర్షాల కారణంగా పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు అవగాహన పరచాలని వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా లంక గ్రామాలలో పశువుల దానాకు ఇబ్బందు లేకుండా రైతులు పశుగ్రాసాన్ని నిల్వ చేసుకునేలా వారికి తెలియజేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. భారీ వర్షాల వల్ల నీరు సాఫీగా ప్రవహించేందుకు వీలుగా డ్రైనేజీలను శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. అత్యవసరమైన సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాల తరలించేందుకు ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచాలని ఆర్టీసీ అధికారులు ఆదేశించారు. అధిక వర్షాలు, ఈదురుగాల వల్ల విద్యుత్తు తీగులు తెగిపోవడం జరుగుతుందని విధుల నిర్వహణలో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాను కారణంగా వాతావరణ శాఖ రానున్న మూడు రోజులలో భారీ వర్షాల హెచ్చరికల చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తతతో పూర్తి సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

తొలుత వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ తుఫాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో సమీక్షించారు.

ఈ గూగుల్ మీట్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, డిఎంహెచ్వో డాక్టర్ జి గీతా బాయ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారి శ్రీనివాసరావు, డిపిఓ ఎం.రామ్నాథ్ రెడ్డి, జిల్లా ఆర్ అండ్ బి అధికారి శ్రీనివాసరావు, సిపిఓ కే.శ్రీనివాసరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు,జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

3.11