జిల్లా అధికారులు ప్రతి అంశంలో జిల్లాను ముందంజలో ఉండేలా కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లాలో పట్టణ, గ్రామీణ వైద్య సేవలు భేష్.. రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం…
యూరియా అందుబాటు, ధర, రవాణా శాఖ పన్నులు వసూలు, రెవిన్యూ సర్వీస్ లలో మొదటి మూడు స్థానాలు .. ప్రజా స్పందన నివేదికలో వెల్లడి…
రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ రానున్న 2027 జనాభా లెక్కల సేకరణ,175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు, డిస్పెన్సరీలు, ఐఎంఎస్ ఆసుపత్రుల నిర్మాణానికి భూమి కేటాయింపు, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్ అంశాలపై జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గీతా బాయి, డి సి హెచ్ ఎస్ పి.సూర్య నారాయణ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, వివిధ శాఖలు జిల్లా అధికారులు హాజరయ్యారు.
ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయా ఆనంద్ మాట్లాడుతూ ముందుగా 2027 జనాభా లెక్కల సేకరణ సన్నాహక ఏర్పాట్లపై మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ సక్రమంగా సజావుగా నిర్వహించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆదిశగా కలక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ తగిన మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని వాటిని తుఛ తప్పక పాటించి రానున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కలక్టర్లకు స్పష్టం చేశారు. అంతకు ముందు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు ప్రక్రియ ప్రగతిని సిఎస్ విజయానంద్ కలక్టర్లతో సమీక్షించారు. తదుపరి డిస్పెన్సరీలు, ఐఎంఎస్ ఆసుపత్రుల నిర్మాణానికి భూమి కేటాయింపు తదితర అంశాలపై సమీక్షించారు. తొలుత 2025 డిసెంబర్ 25 నుండి జనవరి 26 వరకు జిల్లాలు వారీగా వివిధ అంశాలపై పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్ సంతృప్తి స్థాయిలను ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. దీనిలో వైద్య సేవలు అందుబాటు, యూరియా అందుబాటు, రవాణా శాఖ టాక్స్లు, అగ్నిమాపక శాఖ ఎన్ఓసి జారి, రెవెన్యూ శాఖ ఆర్ఓఆర్ లు, పట్టణ ప్రాంతాల్లో వీధిలైట్లు వెలగడం, మంచినీటి సరఫరా తదితర అంశాల్లో పశ్చిమగోదావరి జిల్లా మెరుగైన స్థానాలలో ఉంది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దీనిపై మరింత ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అదేవిధంగా ఈ పి టి ఎస్ ఫైల్స్ అప్లోడింగ్ పై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని ఇకపై మరింత శ్రద్ధ తీసుకొని మంచి ప్రగతి చూపిస్తామన్నారు. జిల్లాలో ఎంఎస్ఎంఇ పార్కుల అంశంపై మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేనందున ప్రైవేటు డెవలపర్స్ తో నియోజకవర్గాల వారిగా ప్రజా ప్రతినిధులుతో కలిసి ఎన్ఎస్ఎల్ఈ పార్కుల స్థాపనకు అవగాహన కల్పిస్తున్నామని, ఈ సమావేశాల ద్వారా ప్రైవేటు డెవలపర్స్ నుండి మంచి స్పందన లభిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.