Close

జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బిఎల్ఓ లను ఆదేశించారు.

Publish Date : 18/02/2026

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల మ్యాపింగ్, ఫారం 6,7,8 క్లైమ్ల పరిష్కారం, యువ ఓటర్ల నమోదు ప్రచారం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమాధానం ఇస్తూ బిఎల్వోలు ఫీల్డ్ వెరిఫికేషన్ కి వెళ్ళిన సందర్భంలో ఐడెంటి కార్డును తప్పనిసరిగా ధరించాలన్నారు. వివిధ కళాశాలల్లో యువ ఓటర్ల నమోదుకు అవగాహన సదస్సులను నిర్వహించి, ఓటర్లుగా నమోదు చేయించాలని తెలిపారు. ఓటర్లు జాబితా, బి ఎల్ వోల జాబితాలను రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేయాలని సూచించారు. 2025 వరకు చనిపోయిన ఓటర్సును జాబితా నుండి తొలగించి, కొత్త ఓటర్లను నమోదు చేయాలని సూచించారు. పాలకొల్లు నియోజకవర్గానికి కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ ను, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి తాడేపల్లిగూడెం ఆర్డీవోను ఇఆర్వోలుగా జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ప్రతిపాదిస్తూ ఎలక్షన్ కమిషన్ కు ప్రతిపాదనలను పంపడం జరిగినది.

ఈ సమావేశంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఎలక్షన్ సెక్షన్ డిప్యూటీ తహసిల్దార్ మర్రాపు సన్యాసిరావు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు టిడిపి మరపట్ల శ్యాంబాబు, బిజెపి కె.రవికుమార్, జేఎస్పీ బి.శివ, వైయస్సార్సీపి కే.నాగేశ్వరరావు, సిపిఎం బి.వాసుదేవరావు పాల్గొన్నారు.