Close

జిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ కార్యక్రమాలను ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకెళ్లాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 23/12/2025

నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు సుపరిపాలన వారోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా అధికారులతో కార్యశాల నిర్వహించి సుపరిపాలన ఏవిధంగా అందించాలో సప్త సూత్రాలను వివరిస్తూ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరు ఓపికతో వింటారో వారు మంచి పరిపాలన అధికారిగా పేరు తెచ్చుకుంటారన్నారు. పరిపాలన ఏ స్థాయిలో ఉన్న సమానత్వం చాలా అవసరం అన్నారు.

సుపరిపాలన అందించాలంటే సప్త సూత్రాలను విధిగా పాటించాలన్నారు. అందులో మొదటిది నిస్వార్థంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలన్నారు. తన వద్దకు పై స్థాయి గాని, కింది స్థాయి గాని ఎటువంటి వ్యక్తి వచ్చిన సమానంగా స్పందించి ఒకే విధమైన న్యాయం చేయాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా మన వద్దకు వస్తే మన సొంత అభిప్రాయాలను కాకుండా వాస్తవ విషయాలను తెలుసుకొని తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చాలామందికి సరైన మార్గదర్శకం చేస్తే ఏ పనైనా చేయగలుగుతారన్నారు. ఏదైనా ఒక పని వలన తప్పు గాని జరిగితే బాధ్యులుగా ఉంచేందుకు జవాబుదారితనం చాలా ముఖ్యమన్నారు. సరైన నాయకత్వం వహించి అందరినీ ముందుకు నడిపించాలన్నారు. ఎవరైనా మన వద్దకు వస్తే ఓపికతో విని చేతనైన సహాయం, న్యాయం చేయాలన్నారు. అప్పగించిన పనులను మంచిగా ఆలోచించి సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. పాలనలో పని చేయించేది, పాలసీ చేసేది రెండు తెలియాల్సి ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై.దోసి రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డ్వామా పిడి డాక్టర్ కే సిహెచ్ అప్పారావు, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిఎంహెచ్వో డాక్టర్ బి.గీతాబాయి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అరుణ కుమారి, ఎల్ డి ఎం ఏ.నాగేంద్రప్రసాద్, జిల్లా విద్యుత్ శాఖ అధికారి పులి ఉషారాణి, మెప్మా పిడి హెప్సిబా, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.