Close

జిల్లాలో అన్న క్యాంటీన్ల నిర్వహణపై ఫిర్యాదులు అందితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 23/01/2026

భీమవరం పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలను అంతా పరిశీలించారు. ఉదయం అల్పాహారం స్వీకరిస్తున్న వారితో కొంతసేపు మాట్లాడి అన్న క్యాంటీన్లో వడ్డిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యత, రుచి, త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎక్కువమంది ఆహార పదార్థాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి మాత్రం మధ్యాహ్నం భోజనంలో అన్నం సరిగ్గా ఉడకడం లేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ కూడా స్వయంగా అల్పాహారం రుచి చూశారు. అనంతరం క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారమైన ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆహారానికి ఇబ్బంది పడకుండా అన్న క్యాంటీన్లను నిర్వహిస్తుందన్నారు. వివిధ ప్రాంతాల నుండి పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే ప్రజలు అల్పాహారం, భోజనం కొరకు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఆహారాన్ని కూడా తీసుకొని పరిస్థితి ఉండకూడదనే ఆలోచన చేసి ఒక పూటకు కేవలం ఐదు రూపాయలు చొప్పున ఆహారాన్ని అందించడం చాలా గొప్ప విషయం అన్నారు. దీనిని ప్రజలు సక్రమంగా వినియోగించుకునేందుకు క్యాంటీన్ నిర్వాహకులు పరిశుభ్రమైన వాతావరణంలో, నాణ్యమైన వస్తువులతో, రుచికరమైన ఆహార పదార్థాలను అందించాలని, ఏదైనా ఫిర్యాదులు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే ఆహార పదార్థాలను వడ్డించేవారు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని, క్యాంటీన్ లోపల, బయట, హ్యాండ్ వాష్ ఏరియాలో చాలా పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు. జిల్లాలో అన్న క్యాంటీన్ల నిర్వహణపై ప్రజల అభిప్రాయాలను సేకరించిన సందర్భంలో సంతృప్తి స్థాయి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేలా మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు క్యాంటీన్లను, ఆహార పదార్థాలను ఆకస్మికంగా తనిఖీ చేసి లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. జిల్లాలో అన్న క్యాంటీన్ లపై ఫిర్యాదులు ఉంటే మున్సిపల్ కమిషనర్ కు తెలియజేయవచ్చునని, నిర్వహణ లోపాలు ఉంటే నిర్వాహకులపై చర్యలు తప్పవని మరొకసారి హెచ్చరించారు.

అనంతరం భీమవరం ఏరియా హాస్పిటల్ వద్ద ఆక్రమణలు తొలగించిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆక్రమణదారులు ఎక్కడ ఉంటున్నారు ఆరా తీశారు. ఖాళీ స్థలంలో గ్రీనరీని అభివృద్ధి చేయాలని, టు వీలర్ పార్కింగ్ ను కొంతకాలం ప్రయోగాత్మకంగా నిర్వహించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఏరియా హాస్పిటల్ వద్ద ఉన్న వంతెనపై నాలుగు చక్రాల వాహనాల రాకపోకలను నిరోధించేందుకు హర్డిల్స్ ఏర్పాటు ఎలా ఉందని అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లేలా ఏర్పాటు చాలా బాగుందని, అన్ని వాహనాలు వెళ్లడం వలన తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తి చాలా ఇబ్బంది పడేవారుమని ఇలాగే కొనసాగించాలని వారు జిల్లా కలెక్టర్కు విన్నవించడం జరిగింది.

ఈ సందర్భంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ మున్సిపల్ కమిషనర్ ఏ.రాంబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి పార్థసారథి, శానిటరీ ఇన్స్పెక్టర్, తదితరులు ఉన్నారు.