జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

బుధవారం తణుకు పట్టణంలో సాంఘిక సంక్షేమ ప్రభుత్వ కళాశాల – 1 & 2 బాలుర వసతి గృహాలు, బాలికల వసతి గృహమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహముల నిర్వహణను మరియు పరిసరాలను పరిశీలించారు. వసతి గృహాల విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. మీరు బాగా చదువుకుంటున్నారా వసతి గృహంలో మీకు సదుపాయాలు ఎలా ఉన్నాయి. భోజనములు ఎలా ఉంటున్నాయి మెనూ ప్రకారం పెడుతున్నారా అని అడిగారు. మీకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రశ్నించారు. విద్యార్థులు మాట్లాడుతూ మేము బాగానే చదువుకుంటున్నాము మాకు అన్ని సౌకర్యాలు, భోజన వసతులు బాగున్నాయి. ఇబ్బందులు ఏమి లేవని తెలపగా ఏమైనా ఇబ్బందులు ఉంటే భయపడకుండా నా దృష్టికి తేవచ్చునని కలెక్టర్ అన్నారు. సందర్భంలో బాలుర వసతి గృహం నెంబర్ -1 కు రూ.18.5 లక్షలు, నెంబర్ – 2 కు రూ.8.31 లక్షలు, బాలికల వసతిగృహంకు రూ.2.41 లక్షల వ్యయంతో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులలో నూతనముగా నిర్మించిన వంట షెడ్డు, టాయిలెట్స్, రూముల మరమ్మత్తులు, నిర్మాణ పనులు, హాస్టల్ ప్రాంగణంలో లెవెలింగ్, తదితర పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తిచేసి పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఇంకా అవసరమైన మరమత్తులకు ప్రతిపాదనలు సమర్పించి పనులను చేపట్టాలన్నారు. బాల, బాలికల వసతి గృహాలను సందర్శించిన సందర్భంలో కళాశాల బాలురను ఏ కోర్సులు, చదువుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ప్రశ్నించారు. ఎక్కువమంది పాలిటెక్నిక్ చదువుతున్నామని బదులు ఇచ్చారు. మంచి కోర్సును ఎంపిక చేసుకున్నారని, ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయని, భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. వసతి గృహంలో చేరికలు పెరగడానికి మీరు కూడా బంధువులకు, స్నేహితులకు చెప్పి వసతి గృహంలో చేరేలా చూడాలన్నారు. అనంతరం బాలికల వసతి గృహంలో పిల్లలతో మమేకమై బాగా చదువుకుంటేనే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని తెలిపారు. పిల్లలకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా భోజనము వడ్డించి, ఆహార పదార్ధములను రుచి చూశారు.
ఈ సందర్భంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి. వి. ఎస్. బి. రామాంజనేయరాజు, తణుకు మున్సిపల్ కమిషనర్ టి.రామకుమార్, తణుకు తహాసిల్దార్ డి.వి.ఎస్.అశోక్ వర్మ, హెచ్ డబ్ల్యుఓ ఫణి కుమార్, రామకృష్ణ, వై.అరుణ, తదితరులు పాల్గొన్నారు.