జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని సర్వే నెంబర్లు వారీగా పరిశీలన చేసి హేతుబద్ధంగా మార్కెట్ విలువ పెంపుదలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు
గురువారం స్థానిక కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వార్డులు, బ్లాకులు సర్వే నెంబర్లు వారీగా పరిశీలన చేసి హేతుబద్ధంగా మార్కెట్ విలువ పెంపుదలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. సర్వే నెంబర్లు వారీగా ఈసీ డేటా తీసుకొని నిర్ధారించాలన్నారు. కొత్తగా వచ్చిన డోర్ నెంబర్లు సేకరించాలని తెలిపారు. సరిహద్దు గ్రామాల మధ్య సర్వే నెంబర్లు వేరువేరుగా ఉన్నప్పుడు పరిశీలన చేసి ఒకే విధముగా విలువకు తీసుకురావాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయ, ఇతర నివాస స్థలాలకు వేరువేరు ప్రత్యేకంగా గుర్తించాలని అన్నారు. ఫీల్డ్ మ్యాపులను సేకరించి పరిశీలన చేయాలని అన్నారు.
రెండు మూడు రోజుల్లో ప్రతిపాదనలు తయారుచేసి అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ ఎన్.మాధవి, జిల్లా రిజిస్ట్రార్ ఎల్.వెంకటేశ్వర్లు, జిల్లా ఆడిట్ రిజిస్ట్రార్ ఎం.పార్వతి, జిల్లాలోని అందరూ సబ్ రిజిస్ట్రార్ తదితరులు పాల్గొన్నారు.