జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను నూరు శాతం వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
భీమవరం కలెక్టరేట్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం సర్వే, వైద్య, వ్యవసాయ, విద్య, పంచాయతీరాజ్, ఐ సి డి ఎస్, ఉద్యానవన శాఖల అధికారులతో సమావేశమై కేంద్రం జిల్లాకు కేటాయించిన ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై సమీక్షించారు. తొలుత ఏ ఏ శాఖలలో ఏ ఏ పథకాల కింద ఎంత నిధులు మంజూరయ్యాయి, వాటిని ఎంతవరకు ఖర్చు చేశారు, ఇంకా ఎంత ఖర్చు చేయాలి, ఏ ఏ పనులు ప్రోగ్రెస్ లో ఉన్నవి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగానికి ఒక మాసం గడువు మాత్రమే ఉన్నదని, ఈ లోపుగా నిధులను నూరు శాతం సద్వినియోగం చేయాలన్నారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ పథకాలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తూ జాతీయ లక్ష్యాలను సాధించడానికి రూపొందించబడ్డాయన్నారు. కేంద్రం నుంచి 60:40 నిష్పత్తిలో, కొన్ని పథకాల్లో 90:10 లేదా పూర్తి కేంద్ర నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఎపీసి పి.శ్యాంసుందర్, డిఎంహెచ్ఓ డా.జి.గీతాబాయి, జిల్లా సర్వే అధికారి జాషువా, పంచాయితీ రాజు ఎస్.ఇ శ్రీనివాసరావు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి రాజేష్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎం.హరి ప్రసాద్, ఐసిడిఎస్ ఎఓ విజయ లక్ష్మీ , వ్యవసాయ శాఖ ఎడి, తదితరులు పాల్గొన్నారు.