Close

జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాలు నిర్వహణ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 29/01/2026

మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాలలో భాగంగా “స్పర్శ” లెప్రసీ అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, ఎం ఎల్ హెచ్ పి, ఏఎన్ఎంలు ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడి వర్కర్లు ప్రతిజ్ఞ చేయాలన్నారు. ప్రజలకు పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల సామాజిక వివక్షతను తొలగించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. స్పర్శ లేని మచ్చలు కుష్ఠు కావచ్చు, అశ్రద్ధ చేస్తే అంగవైక్యం వస్తుందన్నారు. కుష్టు వ్యాధి పూర్తిగా నయం చేయగల వ్యాధి అని సమయానికి గుర్తించి చికిత్స తీసుకుంటే వికలాంగత్వాన్ని నివారించవచ్చు అన్నారు. ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి చికిత్స పొందాలన్నారు. అవగాహన కార్యక్రమాలలో కుష్టు వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలు, ఉచిత చికిత్స సదుపాయాలపై తెలియజేయాలన్నారు. అలాగే అవగాహన ర్యాలీ, పోస్టర్ ప్రదర్శన ఆరోగ్య శిబిరం ద్వారా ప్రజలకు సమాచారం అందించాలని సంబంధిత వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.