• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

చిన్ననాటి పరిస్థితులు అనుకూలంగాలేకున్నా నేడు ఐఏఎస్ గా ఎంపిక కావడం వెనుక డిఆర్వో మొగలి వెంకటేశ్వర్లు కృషి అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 02/09/2025

పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ ఇటీవల కన్ఫార్మ్డ్ ఐఏఎస్ గా పదోన్నతి పొందిన డిఆర్వో వెంకటేశ్వర్లు కు మంగళవారం భీమవరం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చేతులు మీదగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం, ప్రత్యేక పరిస్థితులలో వివిధ వసతి గృహాలలో విద్యను అభ్యసించినా, ఎక్కడా వెనుకడుగు వేయకుండా అంచెలంచెలుగా నేడు ఐఏఎస్ శిఖరాన్ని అందుకోవడం చాలా గర్వించదగిన విషయం అన్నారు. ఎంతోమంది విద్యార్థులకు వీరి జీవితం ఒక మార్గదర్శకం అన్నారు. అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నను రాణించలేని పరిస్థితుల్లో నేడు యువత ఉన్నదని, ఇటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. మంచి స్నేహభావంతో, చిరునవ్వుతో మెలిగే వీరు పనిలో కూడా అంతే శ్రద్ధ కనపరచి జిల్లా యంత్రాంగానికి మంచి సర్వీస్ అందించారని, జిల్లాకు మంచి పేరు తెచ్చారని కొనియాడారు. వీరికి రాష్ట్ర సచివాలయంలో, జిల్లాలలో పనిచేసిన అనుభవం ఉందని, రానున్న రోజుల్లో ప్రజలకు మరింత సేవలను అందించాలని ఆకాంక్షించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన వారికి పదోన్నతి, గౌరవం తప్పకుండా లభిస్తాయన్నారు. దీనికి నిదర్శనం మన డిఆర్ఓ వెంకటేశ్వర్లు అన్నారు. వెంకటేశ్వర్లుకు ఐఏఎస్ గా పదోన్నతి అంటే అది మరో గొప్ప బాధ్యత అన్నారు. గత అనుభవాలను మేళవించి కచ్చితంగా బాగా రాణిస్తారని నమ్మకం నాకు ఉందన్నారు. వెంకటేశ్వర్లు పనిచేసే విధానం చాలా పాజిటివ్ గా ఉంటుందన్నారు. ఫైల్ డీల్ చేయడంలో చాలా ఎఫిషియెంట్ గా ముందుకు వెళ్లడం చూశానన్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు.

సన్మాన కార్యక్రమంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, భీమవరం, నరసాపురం ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.