గత వారం రోజులుగా వాతావరణ పరిస్థితులపై జిల్లాలోని రైతులను నిరంతరాయంగా అప్రమత్తం చేస్తూనే ఉన్నామని, ధాన్యం కొనుగోలు పక్రియ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రాష్ట్ర సీఎస్ కు వివరించారు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపధ్యంలో రానున్న నాలుగు రోజుల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు సహా కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలక్టర్లను, జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆర్టీజిఎస్, పాజిటివ్ పబ్లిక్ పెరస్పన్, డాక్యుమెంట్ అప్లోడ్ ఫర్ ఏజెంట్ స్పేస్ అంశాలపై గురువారం ఎపి సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లలు, జాయింట్ కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందుగా ఈసీజన్లో ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం సేకరణపై సమీక్షీంచారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపధ్యంలో రానున్న నాలుగు రోజుల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైయస్సార్ కడప జిల్లాలు సహా మిగతా కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కావున ఎక్కడా ధాన్యం తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై రైతులను అప్రమత్తం చేసి ఎక్కడా ధాన్యం తడవకుండా చూడాలని చెప్పారు. ఆర్టీజిఎస్ ద్వారా నిరంతరం తుఫాను సమచారారాన్ని ఎస్ఎంస్ ల ద్వారా తెలియజేయాలని ఆర్టీజిఎస్ అధికారులను ఆదేశించారు. ధాన్యం తడిసి పోయి మాయిశ్చర్ శాతం పెరిగిందనే ఫిర్యాదు రాకూడదని స్పష్టం చేశారు. ఈకారణంతో రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని బయట విక్రయించినట్టు ఫిర్యాదులు వస్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎస్ స్పష్టం చేశారు.ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అనంతరం సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్సియల్ పాఠశాలపై సమీక్షిస్తూ తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం పరిస్థితులు పూర్తిగా మెరుగు పడాలని సంక్షేమ శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రైతులను వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నామన్నారు. రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటిగా ధాన్యం సేకరణను ప్రారంభించడం జరిగిందని, ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. ఎప్పటికప్పుడు ఆర్ఎస్కే లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందని, అధికారులకు సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలను కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గోనెసంచులను, టార్పాలిన్ లను సిద్ధం చేయడం జరిగిందని వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.