కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దత్తత గ్రామం పెద్దమైనవాని లంక సముద్రం ఒడ్డున నిర్మిస్తున్న అడ్డుకట్టను పరిశీలించిన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
నరసాపురం మండలం పెద్దమైనవాని లంక వద్ద నిర్మాణంలో ఉన్న సముద్రపు కోత నిరోధక అడ్డుకట్ట నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు ఎప్పటికీ పూర్తవుతాయి, ఇంకా ఏమి పనులు చేపట్టాలి, తదితరు వివరాలను డిలైట్ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మీ గ్రామ ప్రజల కోసం చేస్తున్న ఎంత గొప్ప మేలు అని, ప్రజలందరూ సహకరించాలన్నారు. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టి తీసుకురావాలని డిలైట్ ప్రతినిధులకు సూచించారు.
అనంతరం రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ సహకారంతో మొంథా తుఫాన్ పునరావసర పథకం కింద మత్స్యకారులకు అందజేయడానికి సిద్ధం చేస్తున్న బోట్లు నిర్మాణ పనులను, వలలను స్వయంగా పరిశీలించి నిర్మాణ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. పూర్తిస్థాయిలో బోట్లు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి తెలియజేస్తే, లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. బోట్లు వినియోగానికి లబ్ధిదారుల పేరున లైసెన్స్ పొందడానికి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని మత్స్య శాఖ ఎఫ్డిఓ ను ఆదేశించారు. రామకృష్ణ మిషన్ సహకారంతో మొంథా తుఫాన్ పునరావసర పథకం కింద వందమంది మత్స్యకారులకు ఒక్కొక్కరికీ రూ.50 వేలు విలువ కలిగిన పడవ, రూ.20 వేలు విలువ కలిగిన వలను రూ.70 లక్షల వ్యయంతో అందజేయనున్నారు. చివరిగా పడవలు ప్రారంభానికి అనువైన సముద్ర బ్యాక్ వాటర్ చానల్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మైల వసంతరావు, మత్స్య శాఖ ఎఫ్డిఓ ఏ.దుర్గ ఏడుకొండలు, తహసిల్దార్ ఐవివి సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.