కులమతాలకు అతీతంగా శాంతి, సౌబ్రాతృత్వంతో స్నేహపూర్వక వాతావరణంలో పర్వదినాలను అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.

ఆదివారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ మరియు పీస్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన శాంతి కమిటీ (పీస్ కమిటీ) సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాకు ప్రశాంతమైన జిల్లాగా పేరు ఉందని, ఇకముందు కూడా ఇదే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. పండుగ పర్వదినాలను కుల, మతాలకు అతీతంగా స్నేహభావంతో అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని కోరారు. హిందువుల తొలి పండగ వినాయక చవితి నుండి ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం వినాయక విగ్రహాల నిమర్జన కార్యక్రమం కొనసాగుతుందని, ప్రశాంత వాతావరణంలో నిమర్జనాలను పూర్తి చేసి గణపతి ఆశీస్సులు పొందాలన్నారు. నిమర్జనం సమయంలో ఎవర్ని ఇబ్బంది పెట్టని విధంగా, గొడవలకు తావు లేకుండా పూర్తి చేయాలన్నారు. వినాయకుల పందిళ్ళలో, నిమర్జనాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో డీజే సౌండ్ సిస్టం అనుమతి లేదని స్పష్టం చేశారు. ఊరేగింపు సమయంలో హాస్పిటల్స్, మసీదులు వద్ద చాలా తక్కువ సౌండ్ తో మాత్రమే ఊరేగింపులు కొనసాగాలన్నారు. వినాయక పందిళ్ళలో అశ్లీలమైన పాటలు, సినిమా పాటలు వేయకుండా భక్తి పాటలు మాత్రమే వేయాలని సూచించారు. ఇది దైవ కార్యమని మర్చిపోకూడదని భక్తిని పెంపొందించేలా మధురమైన సంగీతంతో దేవుని పాటలు ఉండాలన్నారు. నిమర్జనం సమయాలలో ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా అందరూ సమన్వయంతో కార్యక్రమాల్ని పూర్తి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు పీస్ కమిటీ వైస్ చైర్మన్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ పండగ పరవ దినాలను ప్రశాంత వాతావరణ నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా పూర్తి చేయడం జరిగింది అన్నారు. గణపతి మహోత్సవాలు అందరివి అని, ప్రాంతాలు, కులాలు కులాలవారీగా విని విడిగా చూడవద్దన్నారు. నిమర్జనం ఊరేగింపు సమయంలో ఐదు, పది నిమిషాలు ట్రాఫిక్ అంతరాయం వచ్చిన సహకరించాలని, చిన్న, చిన్న సమస్యలను పెద్దవిగా చేయొద్దని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్, రెవిన్యూ అధికారులను సంప్రదించాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వినాయక మహోత్సవాలు ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఎలక్ట్రిసిటీ, ఫైర్, పోలీస్, రెవిన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖలకు తగు ఆదేశాలను జారీచేయడం జరిగింది అన్నారు. అందరూ సమన్వయంతో నిమర్జమాలను పూర్తి చేయాలన్నారు.
జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పర్వదినాలను నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందన్నారు. వినాయక చవితి ప్రారంభమై నాలుగు రోజులు పూర్తయిందని, నేడు సుమారు 500 విగ్రహాలకు నిమర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. వినాయక చవితి పందిళ్ళ ఇన్చార్జి విద్యుత్ కారణంగా ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిజె సౌండ్ కారణంగా గర్భిణీ స్త్రీలకు అత్యంత ప్రమాదం జరుగుతుందని డీజే లకు అనుమతి లేదన్నారు. నిమర్జనాలకు సూచించిన ప్రాంతాల్లోనే చేయాలని, అక్కడ మాత్రమే బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పంట పొలాల్లో, త్రాగునీటి వనరులలో వినాయక నిమర్జనలను చేయవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీవోలు మరియు కమిటీ మెంబర్లు దాసిరాజు, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఖతీబ్ కౌసర్ భానో, డీఎస్పీ లు జై సూర్య, శ్రీ వేద, డి.విశ్వనాథ్, డి పి ఆర్ ఓ మరియు కమిటీ కన్వీనర్ టీ.నాగేశ్వరరావు, కమిటీ మెంబర్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.వి ప్రసాద్ రెడ్డి, డిఎంహెచ్వో డాక్టర్ జి.గీతాబాయి, భీమవరం మున్సిపాలిటీ సహాయ కమిషనర్ రాంబాబు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి, వివిధ పార్టీల ప్రతినిధులు, వివిధ మతాల పెద్దలు, ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.