కుటుంబ సర్వే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత కల్పించి, అర్హులైనవారికి ప్రయోజనాలు చేరేలా చేస్తుంది
జిల్లా ప్రజలందరూ సర్వే ని పూర్తి చేసుకోవాలి
… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం పట్టణం 37వ వార్డు రజికపేటలో స్వర్ణ వార్డ్ సిబ్బంది నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వేను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక రోజులో ఎన్ని చేయగలుగుతున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని సిబ్బంది ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఒక కుటుంబానికి సంబంధించిన ఏకీకృత కుటుంబ సర్వే డేటాను యాప్ లో స్వయంగా ఫోటోతో సహా, అప్లోడ్ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఏకీకృత కుటుంబ సర్వే అంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ వివరాలను సేకరించే కార్యక్రమం అన్నారు. తద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత కల్పించి, అర్హులైనవారికి ప్రయోజనాలు చేరేలా చేయడం జరుగుతుందన్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయం సిబ్బంది ఇంటింటికీ వచ్చి ఆధార్ ఆధారంగా 38 రకాల వివరాలు సేకరిస్తారని , ఇందుకు ప్రజలు సహకరించాలన్నారు. వీటిలో పేరు, పుట్టిన తేదీ, మొబైల్, నివాస కాలం, విద్యార్హత వంటి వ్యక్తిగత వివరాలు, ఉద్యోగ & ఆదాయం వివరాలు, ఇల్లు స్థితి, గృహోపకరణాలు వివరాలను సేకరించడం జరుగుతుందన్నారు. ఒకవేళ సచివాలయ సిబ్బంది రాకపోతే స్థానిక అధికారులను సంప్రదించండి. అధికారిక యాప్ ద్వారా నమోదు చేయించుకోవాలని సూచించారు. అర్హులైనవారికి పథకాలు సులభంగా చేరేలా డేటా నవీకరణ జరుగుతుందని రేషన్ కార్డు లేదా సాంకేతిక సమస్యల వల్ల లభించని పథకాలు ఇకపై అందుతాయని స్పష్టం చేశారు.
ఈ సందర్భంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, మేనేజర్ నాగేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.