Close

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా నూతన ఇండస్ట్రియల్ పార్క్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Publish Date : 15/05/2025

గురువారం పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో రూ.10.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫ్లాటెడ్ కాంప్లెక్స్ (ఇండస్ట్రియల్ పార్క్) నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీచైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణాలకు మంచి ఆలోచన చేసిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. నాలుగు నెలల్లో కాంప్లెక్స్ నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, ప్రజలు ఇక్కడికి ప్రజలు రాకపోకలకు అనువుగా రోడ్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. రానున్న ఒకటి, రెండు సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి సమీపంలో రింగ్ రోడ్డు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఈ లోపుగా వాహనాల రాకపోకలు సులువుగా సాగించేందుకు రోడ్డున సాధ్యమైనంత మేర అభివృద్ధి చేయాలన్నారు. వర్షాలు, తుఫాన్లుకు ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతుందని, నిర్మాణ సామాగ్రిని తరలించేందుకు కూడా ఇబ్బంది ఉంటుందని వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్లాటెడ్ కాంప్లెక్స్ నిర్మాణం ఉద్దేశాన్ని, ప్రయోజనాలను ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకెళ్లాలని, తద్వారా పారిశ్రామికవేత్తలు వివిధ రకాల ఇండస్ట్రీస్ ను నేలకల్పేందుకు ముందుకు వస్తారన్నారు. మెగా కంపెనీ ఒక వెల్డింగ్ వర్క్ తో తొలుత ప్రారంభమై ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిందే అన్నారు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు పరిశ్రమల శాఖ కూడా ప్రోత్సాహాన్ని అందించాలని ఈ సందర్భంగా తెలిపారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఫ్లాటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇప్పటికే రూ.9.50 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఫ్లాటెడ్ కాంప్లెక్స్ ఏర్పాటు చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కాంప్లెక్స్ నందు పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే టాక్స్ లాభంతోపాటు, అనుమతులు కూడా త్వరగా పొందవచ్చని తెలిపారు. కాంప్లెక్స్ ను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గాన్ని ఒకటి చొప్పున ఎం ఎస్ ఎం ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే 11 నిర్మాణాలను పూర్తి చేసుకోవడం జరిగిందని, 39 నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా మన జిల్లాలో తొలివిడతగా నరసాపురం, ఉండి నియోజకవర్గాలను ఎంపిక చేసి ప్లాటెడ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. విస్సకోడేరులో 25 వేల ఎస్ఎఫ్టి విస్తీర్ణంలో రూ.10.50 కోట్ల అంచనా వ్యయంతో ప్లాటెడ్ కాంప్లెక్స్ నిర్మాణం, రోడ్లు, డ్రైన్లు అన్ని వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. టెండర్స్ ని పిలవడం జరిగిందని, త్వరలో పనులు ప్రారంభించి నాలుగు నెలల్లో పూర్తి చేసుకునేందుకు లక్ష్యంగా పెట్టడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, భీమవరం ఆర్డీవో కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఏపీఐఐసీ జిల్లా మేనేజర్ బాబ్జి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, తహసిల్దార్ విజయలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.