ఏప్రిల్ 15 నాటికి దళ్వా పంటసాగు పూర్తి అయ్యేలా అధికారులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలి. …. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి.
శనివారం కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో రబీ పంట కాలానికి నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రభీ సాగుకు రైతులకు ఎటువంటి నీటి కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. డిసెంబర్ ఒకటో తేదీ నుండి దళ్వా సాగుకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఖరీఫ్ పంట పూర్తి అయినచోట రబి పంటకు సంబంధించిన పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 15 నాటికి రబి పంట పూర్తిస్థాయిలో రైతుల చేతికి వచ్చేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్, మే మాసాలలో పంట కాలువలు, డ్రైయిన్స్ వార్షిక మరమత్తు పనులు పూర్తి చేయాలన్నారు. వచ్చే వేసవి నాటికి పట్టణ, గ్రామ స్థాయిలో ప్రజలకు త్రాగునీరు అందించేందుకు మంచినీటి చెరువులు పూర్తిస్థాయిలో నింపేందుకు అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు.
భీమవరం శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రబి పంటకు సంబంధించి రైతులకు ఎటువంటి సాగునీరు ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పంట కాలువలు, మురికి కాలువలు పూర్తిగా పూడిపోయాయని, ముందుగా వాటిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాలువలు పూడి పోవడం వల్ల శివారు ప్రాంతానికి సాగు నీరు అందడం లేదని దానిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పంట కాలవల్లో ధవలేశ్వరం నుండి ఉప్పుటేరులో నీరు కలిసే వరకు నీరు పూర్తిగా కలుషితం వల్ల ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువ కుటుంబాల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. జిల్లాలో అన్ని కాలువలు, డ్రైయిన్సు పూడికలు తొలగించి వెడల్పు చేయాలన్నారు. దీనిపై అధికారులు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కె.మురళీకృష్ణరాజు, వైస్ చైర్మన్ గుబ్బల మార్రాజు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఇ ఇ యు.రమేష్, ఏఇ వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, డ్రైన్స్ ఏఇలు, డిఇలు, తదితరులు పాల్గొన్నారు.