Close

ఏకీకృత కుటుంబ సర్వే, ఈకేవైసీ వేగవంతంగా పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 02/03/2026

శబ్ద, వాయు కాలుష్యాన్ని నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

జాతరలు, వేడుకలు, దేవాలయాలు, ఆసుపత్రులు వద్ద పెద్ద శబ్దాలతో సౌండ్ సిస్టం వినియోగించరాదు, బాణాసంచా కాల్చరాదు.

జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిaరం లో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శబ్ద, వాయు కాలుష్యం, ఏకీకృత కుటుంబ సర్వే, ఈ కేవైసీ, ఈపిటిఎస్ ఫైల్స్ అప్లోడింగ్ తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతరలు, ఉత్సవాలు, వేడుకలు, దేవాలయాలు, ఆసుపత్రుల వద్ద బాణాసంచా కాల్చకుండా రెవిన్యూ, పోలీస్, దేవాదాయ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.*

సాంప్రదాయ పండుగ అయిన దీపావళి మినహా ఎక్కడ కూడా బాణాసంచా కాల్చకూడదు అన్నారు. శబ్ద, వాయు కాలుష్యం ద్వారా ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారన్నారు. బాణాసంచా కాల్చడం ద్వారా వచ్చే శబ్ద, వాయు కాలుష్యం వల్ల వృద్ధులు, రోగులు, పసి పిల్లల ఆరోగ్యం పై దాని ప్రభావం పడుతుందన్నారు. అదేవిధంగా మార్చి, ఏప్రిల్ మాసాలలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల చదువుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా చదివి పరీక్షలు రాసేలా అందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా ఎక్కడైనా బాణాసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో బాణాసంచా తయారీకి ఏ ఒక్కరికి అనుమతి లేదని, అనధికారకంగా తయారు చేస్తే తీవ్ర కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శబ్ద, వాయు కాలుష్య నివారణకు రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వేసవి దృష్ట్యా ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఏకీకృత కుటుంబ సర్వే, ఈ కేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈపిటి ఎస్ ఫైల్స్ అప్లోడింగ్ ఫై జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు ప్రత్యేక దృష్టి పెట్టి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి హరి సూర్య ప్రకాష్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి. శ్రీనివాసరావు, జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి కే సి హెచ్ అప్పారావు, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.