Close

ఎస్సీ,ఎస్టీల వర్గాల ఆర్థిక పురోభివృద్ధికి, సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 29/05/2025

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులకు సంబంధించి నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలి

గురువారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు జిల్లెల్ల సత్య సుధామ, పొన్నమండ బాలకృష్ణ, డాక్టర్ సిఎం మంగరాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసులపై విచారణ వేగవంతం చేయాలని, బాదితులకు సత్వర న్యాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందుగా గత సమీక్ష సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న కార్యాచరణ పై సమీక్షించారు. కమిటీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సరైన బోధన జరగటం లేదని సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలు దీనికి నిదర్శనమన్నారు. 590 మార్కులకు పైబడి సాధించిన విద్యార్థిని, విద్యార్థులను కూడా సన్మానించడం జరిగిందన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో జాప్యం జరుగుతోందని, ఎస్సీ ఎస్టీ వర్గాల పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఉంటున్నారని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకురాగా గతంలో ఆధార్ ఎన్రోల్ అయి ఉండడం వలన మరి ఒకసారి ఎన్రోల్ చేయడానికి సాధ్యపడదని, సంబంధిత పిల్లల వివరాలను సేకరించి ఆధార్ నమోదులో సాంకేతిక ఇబ్బందులను పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, వివిధ కంపెనీల రిక్వైర్మెంట్ మేరకు వారికి అర్హత కలిగిన వారిని అందించలేకపోతున్నామన్నారు. చదువు మధ్యలో నిలిపి వేసిన విద్యార్థినీ విద్యార్థులను సంబంధిత అధికారులు గుర్తించి వారిని తిరిగి చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్టి, ఎస్సి వర్గాల పిల్లలు స్కూల్ వెళ్ళి చదువుకునేలాగా కమిటీ సభ్యులు ప్రోత్సహించడంతోపాటు, బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పేద వర్గాలకు వైద్య చికిత్సలు సక్రమంగా అందిస్తున్నామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో లభ్యం కానీ కుక్క కాటు, పాము కాటు ఇంజక్షన్లు ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయన్నారు. అదేవిధంగా గుండెపోటుకు సంబంధించి మొదటి గంటలో ఇచ్చే ఇంజెక్షన్ కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా అందిస్తున్నామన్నారు, ప్రజల ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంజక్షన్లను పొందాలని సూచించారు.

కమిటీ సభ్యులు సీ.ఎం మంగరాజు మాట్లాడుతూ కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు ఇచ్చే ప్రోత్సాహకాలు ప్రస్తుతం నిలిపివేశారని వాటిని పునరుద్ధరించాలని కలెక్టర్ కోరారు. అలాగే కుల ధ్రువీకరణ పత్రాలు సత్వరమే జారీ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

కమిటీ సభ్యులు పొన్నమండ బాలకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులకు సంబంధించి కేసులు పోలీస్ స్టేషన్ స్థాయిలోనే నిర్వీర్యం అవుతున్నాయని ఎఫ్ఐఆర్ నమోదుకు జాప్యం జరుగుతుందని, దీనివల్ల బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభించడం లేదని దీనిపై అధికారులతో పర్యవేక్షణ కావాలన్నారు.

కమిటీ సభ్యులు జిల్లెల సత్య సుధామ మాట్లాడుతూ ఎస్ టి, ఎస్ సి వర్గాల వారిపై దాడులకు సంబంధించి బాధితులకు సకాలంలోని నష్టపరిహారం అందుతోంది అన్నారు. గత సమావేశంలో చర్చించిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ యు.బీమారావు,డి ఎస్ డబ్ల్యు ఓ బి.వి.ఎస్.బి రామాంజనేయ రాజు, భీమవరం ఆర్డీవో ప్రవీణ్ కె.కుమార్ రెడ్డి, నరసాపురం ఆర్డీవో దాసిరాజు, తాడేపల్లిగూడెం ఆర్డీవో ఖతీబ్ కౌసల్ భానో, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసి రెడ్డి, నర్సాపురం డి.ఎస్.పి డా. జి శ్రీ వేద, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి. పుష్ప రాణి, సిఐలు, వసతి గృహాల అధికారులు డిస్టిక్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు,