Close

ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, తాగునీటి వనరులలో చేపల చెరువుల నీళ్లు, కాలవ గట్ల నివాసాల్లోని సెప్టిక్ నీటిని వదిలితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు మరియు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు.

Publish Date : 15/05/2025

గురువారం ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంలో తొలుత హాస్పటల్ ను ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశాన్ని పరిశీలించి అక్కడ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఖాళీ స్థలం వైపు నుండి కొంతమంది ఆకతాయిలు హాస్పిటల్ అద్దాలను పగలగొడుతున్నారని ఉపసభాపతి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందిస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఖాళీ ప్రదేశంలోకి వచ్చే దారులు అన్నింటిని మూసివేయాలని ఆదేశించారు. అనంతరం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను పరిశీలించారు. ఇటీవల దాతల సహకారంతో సిహెచ్సి నందు ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో సమావేశమై వైద్య నిర్వాహణలో లోటుపాట్లను తెలియజేయాలన్నారు. ప్రసూతి వైద్యురాలు, చిన్న పిల్లల వైద్య నిపుణులు హాస్పిటల్ లో లేరని దీని కారణంగా డెలివరీలు చాలా తగ్గాయని ఉపసభా ప్రతి దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే ఈ రెండు పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. వారికి అనారోగ్యం వస్తే ఆర్థికంగా చితికి పోతారని, ప్రైవేటు ఆసుపత్రులలో వివిధ పరీక్షల పేరిట వేలాది రూపాయలు, అలాగే డెలివరీ కి తక్కువలో తక్కువ రూ.50 వేలు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆకివీడు సిహెచ్సిని అన్ని విధాలుగా శాసనసభ్యులు అభివృద్ధి చేయడం జరిగిందని, అదే స్థాయిలో మీరు కూడా వైద్య సేవలు అందించి పేదలను ఆరోగ్యపరంగా ఆదుకుని, మంచి పేరు తేవాలన్నారు. డెలివరీలు పెరగాలని, అలాగే ఓపి కూడా బాగా పెరగాలని అన్నారు. రానున్న వారంలోపుగా ప్రసూతి వైద్యులు, పిల్లల వైద్య నిపుణులు కాంటాక్ట్ పద్ధతిలో నియామకానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఆసుపత్రిలో షెడ్ నిర్మాణానికి ఒక లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన దాత సత్యనారాయణ కు ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు శాలువాకప్పి అభినందించారు.

ఆసుపత్రి సందర్శన అనంతరం రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో పెను మార్పులు తీసుకురావడం జరిగిందని, సిబ్బంది కొరత ఉందని డాక్టర్ బిలాల్ చెప్పడం జరిగిందన్నారు. ప్రసూతి వైద్యులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు నియామకాలకు జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కు లేఖను రాయడం జరిగిందని, ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో నియామకం జరపాలని వారు తెలియజేసినట్లు తెలిపారు. రానున్న సోమవారం నుండి ఇద్దరు డాక్టర్లు అందుబాటులోకి వస్తారన్నారు. ఇకనుండి ప్రసూతి కేసులు ఇక్కడే చూడడం జరుగుతుందని, ఓపి కూడా భీమవరం వెళ్లనవసరం లేదని స్పష్టం చేశారు. సిహెచ్సి పరిధిలోని పిహెచ్సి లన్ని ప్రసూతి కేసులను ఆకివీడు సిహెచ్ఐకి మాత్రమే రిఫర్ చేయాలని తెలిపారు. ఆకువీడు ప్రభుత్వ ఆసుపత్రికి ఆనుకుని ఉన్న 1.65 ఎకరాల స్థలంలో వివిధ అభివృద్ధి పనులకు కెనరా బ్యాంకు రూ.50 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులతో ఓపెన్ ఎయిర్ థియేటర్, వాకింగ్ ట్రాక్, యోగ, మెడిటేషన్ సెంటర్, గ్రీనరీ అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే పెదమిరం వి ఎస్ ఎస్ గార్డెన్ దగ్గరలో ఒక ఓపెన్ థియేటర్ ను కూడా నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆకివీడులో, పెదమిరంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ల నిర్మాణాలకు రానున్న జూన్ మొదటి వారంలో శంకుస్థాపనకు ఆలోచన చేయడం జరిగిందని, నాలుగు నెలల్లో పూర్తిచేసే లక్ష్యంతో పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని, దీనికి ప్రజల సహకారం అవసరం అన్నారు. ఎవరైనా ఆక్రమణదారులు ఉంటే ముందుగానే ఖాళీ చేయాలని తెలిపారు. తర్వాత ఏమీ అనుకున్న ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. కాలువ గట్ల ఆక్రమణదారులు కూడా ముందే ఈ విషయాన్ని పత్రిక ముఖంగా తెలియజేస్తున్నానన్నారు. మంచినీటి సమస్య అనేది ఉండకూడదని, మంచినీటి కాలువల్లో చాపల చెరువులు నీళ్ళు, సెప్టిక్ వాటర్ కలపడం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. చిలుకూరులో ఆక్వా చెరువుల యజమానులు చెరువులన్నింటిని పైప్ లైన్ ద్వారా అనుసంధానం చేసి వేస్ట్ వాటర్ ను డ్రైన్ లోనికి వదలడానికి ముందుకు రావడం అభినందించదగిన విషయం అన్నారు. మిగిలిన చెరువు ల యజమానులందరూ పైప్ లైన్ ల ద్వారా వ్యర్ధాలను డ్రైన్ లో కలపాల్సిందేనని, త్రాగు, సాగునీటి వనరుల్లో వదిలితే అటువంటి చెరువులను శాశ్వతంగా మూసివేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ, డాక్టర్ బిలాల్, హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ డి.భువన, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసరావు, డ్వామా పి.డి డాక్టర్ కేసిహెచ్ అప్పారావు, తహసిల్దార్ ఎ.వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ జి.కృష్ణ మోహన్, స్థానిక ప్రజా ప్రతినిధి మోటుపల్లి వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.