Close

ఇంటింటా సర్వేలో భాగంగా కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి, సకాలంలో చికిత్సను అందించడం ద్వారా వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 10/11/2025

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా నవంబర్ 17వ తేదీ నుండి నవంబరు 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తింపు కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా కుష్టివ్యాధి పై ప్రచురించిన అవగాహన పోస్టర్ను సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా నవంబర్ 17వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లాలో కుష్టువ్యాధి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకుని కుష్టువ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దటంలో భాగస్వాములు కావాలన్నారు. కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వ పరంగా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న రోగులను ముందుగానే గుర్తించి సకాలంలో వైద్యం సహాయం అందించగలిగితే వ్యాధిని త్వరితగతిన నివారించవచ్చునని అన్నారు. చర్మంపై స్పర్శ నొప్పి దురద లేని మచ్చలు, మందంగా మెరిసే జిడ్డుగల చర్మం, చెవుల వీపుపై, ఎదపై నొప్పి లేని బోడిపెలు కనుబొమ్మలు మరియు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం ముక్కుదిబ్బడ ముక్కులో నుండి రక్తం కారడం, కాళ్లు, చేతులు తిమ్మిర్లు లేక జోములు కలిగి ఉండటం, అరచేతులు, అరికాళ్ళలో స్పర్శ కోల్పోవడం, చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించలేకపోవడం, చేతులు నుండి వస్తువులు జారిపోవడం, కాళ్లకు చెప్పులు జారిపోవడం, తెలియకుండానే చేతులు కాళ్లలో బొబ్బలు రావడం, చేతి వేళ్ళు కాలివేలు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం తదితర లక్షణాలను ఉన్న యెడల మీ ఇంటి వద్దకు ఆరోగ్య కార్యకర్తలు సర్వే చేయటానికి వచ్చినప్పుడు పరీక్షలు నిర్వహించుటకు సహకరించాలని కోరారు.
పై లక్షణాలువున్న వారు అశ్రద్ధ చేస్తే అంగవైకల్యం సంభవిస్తుందని అన్నారు. ప్రభుత్వం పూర్తి ఉచితంగా మందులు సరఫరా చేస్తుందని అన్నారు. ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్లి తప్పనిసరి వైద్య పరీక్షలను నిర్వహించాలని, స్పర్శలేని మచ్చలు ఉన్న వారిని రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నారు. అనుమానితులకు మల్టీ డ్రగ్ .. బహుళ ఔషధ చికిత్సను అందించాలన్నారు. కుష్టు వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించి 2027 సంవత్సరo నాటికి జీరో కేసులు ఉండాలని, కుష్టు వ్యాధి వల్ల ఒక్క వికలాంగుడు కూడా ఉండకూడదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

తొలుత కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం అవగాహన ప్రచార గోడ పత్రిక, కరపత్రం లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో డిఆర్ఓ బి. శివన్నారాయణ రెడ్డి, జిల్లా వైద్య శాఖ అధికారి జి.గీతాబాయి, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబి అధికారి హెచ్. రవి బాబు, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, డి ఎల్ డి ఓ వై దోసిరెడ్డి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వరరావు, డివిజన్ ప్యారా మెడికల్ అధికారులు ఎంపీ రమేష్, జి వి ఎస్ ఎన్ మూర్తి, యు.వెంకటేశ్వర్లు, జి.సుభాష్, వి.క్రాంతి, తదితరులు ఉన్నారు.