Close

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో ప్రజలకు వివిధ ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 09/02/2026

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 9 నుండి 13 వ తేదీ వరకు నిర్వహించుచున్న అవగాహన కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నందు 2026 ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు అవగాహన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజలు తమ ఆర్థిక వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించుకునేలా అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. పొదుపు అలవాట్లు, బ్యాంకింగ్ సేవల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, రుణాల నిర్వహణ, బీమా పెట్టుబడులుపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించడం అవసరమని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు మహిళలు యువత స్వయం సహాయక సంఘాల సభ్యులు రైతులు ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవడం ద్వారా ఆర్థిక స్వాలాంబనను సాధించగలరని తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా బ్యాంకులు ఆర్థిక సంస్థలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవగాహన సదస్సులు శిక్షణా కార్యక్రమాలు ర్యాలీలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మోసాలకు గురికాకుండా ఉండేందుకు సైబర్ భద్రత ఆన్లైన్ లావాదేవీల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై కూడా ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ప్రతి కుటుంబం తమ ఆదాయం ఖర్చుపై ప్రణాళిక రూపొందించుకుని భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆర్థిక అక్షరాస్యతోనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ వారోత్సవాలను ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఏ.నాగేంద్ర ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.