ఆర్థికంగా, సామాజికంగా బలపడాలంటే విద్యతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

శనివారం ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమమునకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పేదరికం నుండి బయటకు రావాలంటే ఒక్క విద్యతోనే సాధ్యమని అన్నారు. గిరిజనుల జీవన విధానమును నేను చాలా దగ్గర నుంచి చూడటం జరిగినదని అన్నారు. రంపచోడవరంలో పని చేసినప్పుడు గిరిజనులకు న్యాయమైన విద్య, వైద్యంతో పాటు వారికి జీవనోపాధి కల్పించేలా కృషి చేయడం జరిగిందన్నారు. మీరందరూ మెరుగైన విద్యనభ్యసించుటకు సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారని, మంచిగా చదువుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని అన్నారు. బ్రిటిష్ పాలనలో గిరిజనులపై చేసిన అరాచకాలను ఎదిరించి నాయకత్వం వహించిన కొమరం భీం ధైర్య సాహసాలను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులతో అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి.పుష్పరాణి, వసతి గృహం అధికారి డి.శ్రీనివాస్, సిబ్బంది జి.దుర్గారావు, బి. కమల కుమారి, శ్యామ్, శరత్, హాస్టల్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.