ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన కలిగి, కొనుగోలు చేయడం ద్వారా రైతులను ప్రోత్సహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఆరోగ్యంగా ఉండేందుకు ఆర్గానిక్ ఉత్పత్తులను స్వీకరించాలి…
జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్న ఆర్గానిక్ ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించి, గృహంలో వినియోగించే కొన్ని వస్తువులను స్వయంగా డబ్బు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పురుగుమందులు, ఎరువులు లేకుండా ఏ పంటను పండించడం లేదని, తద్వారా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలన్నారు. దీనికి ఆర్గానిక్ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని, ఆర్గానిక్ ఉత్పత్తులు రుచిలో కూడా చాలా బాగుంటాయని తెలిపారు. పిజిఆర్ఎస్ కి వచ్చే ప్రజలు, కలెక్టరేట్ సిబ్బందికి అందుబాటులో ఉంచేందుకు ప్రతి సోమవారం ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలను చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే ఆరోగ్యం అంతమైన దుస్తులను ధరించేందుకు చేనేత వస్త్రాల అమ్మకాలను కూడా ప్రదర్శించడం జరిగిందని, వీటిని కూడా కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తేనే మరింత మంది రైతులు ఆర్గానిక్ ఉత్పత్తుల పండించడానికి ముందుకు వస్తారని తెలిపారు. ఆర్గానిక్ ఉత్పత్తులు దిగుబడి తక్కువగా ఉన్న ప్రజలు మేలుకోరి కొంతమంది అభ్యుదయ రైతులు ఆర్గానిక్ ఉత్పత్తులను పండిస్తున్నారని వారు ప్రజలకు చేస్తున్న మేలు మరువరానిది అన్నారు. ప్రజలందరూ ఆర్గానిక్ కూరగాయలు, ఇతర ఉత్పత్తులను, చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని తెలిపారు. విస్సా కోడేరు వంతెన వద్ద ఏర్పాటుచేసిన ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాల దుకాణంలో ప్రతిరోజు ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రజలకు ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచాలని డిఆర్డిఏ అధికారులకు సూచించారు.