అవకతవకలకు పాల్పడిన వారిపై కేసులు బుక్ చేయాలని తహసిల్దారుకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఆచంట నియోజకవర్గం అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం…
ప్రజల ఫిర్యాదులు, విజ్ఞాపనలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం..
గతంలో పట్టాలు ఇప్పిస్తామంటూ మభ్యపెట్టి డబ్బు వసూలు చేసిన వారిపై చర్యలు తప్పవ్…
ఆచంట నియోజకవర్గం ప్రజల ఫిర్యాదులు, విజ్ఞాపనలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆచంట నియోజకవర్గం శాసనసభ్యులు పితాని సత్యనారాయణతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, నియోజవర్గం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పెనుగొండ మండలం మార్టేరు గ్రామం ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ మభ్యపెట్టి ఒక నాయకుడు డబ్బులు వసూలు చేసి మోసం చేశారని కొంతమంది లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేయాలని తహసిల్దారును ఆదేశించారు. అలాగే ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో నకిలీ పట్టాల పంపిణీ పై సమీక్షిస్తూ తగు చర్యలకు ఆదేశించారు. ఈ సందర్భంలో ఆయా గ్రామాల ప్రజలు బరియల్ గ్రౌండ్స్, డ్రైనేజ్ ల సమస్యలపై కూడా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే 2014 – 2019 మధ్యకాలంలో నిర్మించిన గోకులం షెడ్స్, సిసి రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు చెల్లింపు జరగలేదని, అలాగే 2024-25 సంవత్సరంలో నిర్మించిన గోకులం షెడ్స్ బిల్లులు కూడా చెల్లింపు కాలేదని, సుమారు మూడు వంతుల నిర్మాణాలు పూర్తయిన అంగనవాడి భవనాల నిర్మాణాల విషయాలను శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ డ్వామా, ఐసిడిఎస్ అధికారులను పెండింగ్ బిల్లులు, ఐసిడిఎస్ భవనాల నిర్మాణాలు పూర్తి విషయమై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డిఓ దాసిరాజు, ఆచంట, పెనుమంట్ర తహసిల్దార్ లు సోమేశ్వరరావు, రవికుమార్, ఆచంట పూర్వ తహసిల్దార్ కనకరాజు, హౌసింగ్ పీడీ జి.పిచ్చయ్య, డ్వామా పీడి కే సి హెచ్ అప్పారావు, ఐసిడిఎస్ పిడి డి.శ్రీలక్ష్మి, ఆయా గ్రామాల వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.