అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయడానికి ఉపయుక్తంగా ఉండే యుఎఫ్ సర్వే పూర్తి చేయడం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
భీమవరం పట్టణంలో యుఎఫ్ సర్వే పూర్తి కాకపోవడంపై అసహనం వ్యక్తం
ఒకరు విధులు గురించి మరొకరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు.. మనమందరం ప్రజలకు మేలైన సర్వీస్ లు అందించడానికి నియమించబడ్డాం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి
రానున్న రెండు రోజుల్లో నూరు శాతం ఈఎఫ్ సర్వే, ఈకేవైసీ పూర్తి కాకపోతే చర్యలకు బద్దులు కావాల్సి ఉంటుంది
మీ విభాగ అధిపతి ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనని హెచ్చరిక
….. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా సందర్శించి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై వార్డుల వారీగా సంబంధిత సెక్రటరీతో ఆరా తీశారు. ఎందుకు సర్వే పూర్తి కావడం లేదని నిలదీశారు. ప్రజలకు సేవ చేసే స్థానంలో మనం ఉన్నామని సమయంతో నిమిత్తం లేకుండా పనిచేస్తే వ్యక్తిగత గుర్తింపుతో పాటు, సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న రెండు రోజుల్లో నూరు శాతం సర్వే, ఈ కేవైసీ పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త ఏర్పాటు జరగడం లేదని, మీ వంతు బాధ్యతగా ఇంటింటికి వెళ్లి వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజు తడి చెత్త సేకరించడం జరుగుతుందని, పొడి చెత్త రెండు, మూడు రోజులకు ఒకసారి సేకరించడం జరుగుతుందని తెలియజేయాలన్నారు. ఇప్పటికే సరైన డంపింగ్ ప్రదేశం లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, తడి, పొడి చెత్తలను కలిపి ఇవ్వడం ద్వారా వేరు చేయడం సాధ్యం కాకపోవడంతో పాటు వాతావరణం కలుషితమై పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. చెత్త నిర్మూలన అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా చేపట్టాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్న యధా స్థానంలో వాహనాలను నిలుపుదల చేయడం తగదని హెచ్చరించారు. షాపుల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, వారి షాపు ముందు పార్కింగ్ వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేయాలన్నారు.