అప్సడా రిజిస్ట్రేషన్ ద్వారా ఆక్వా రైతులకు కలిగే ప్రయోజనాలపై విస్తృతమైన అవగాహన కల్పించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్స్ ఫిబ్రవరి 10 నాటికి నూరు శాతం పూర్తి చేయాలి.
జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం అప్సడా రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణాల ప్రగతి, ఇపిటిఎస్ ఫైల్స్ అప్లోడింగ్ అంశాలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మత్స్య శాఖ అధికారులు, ఎఫ్ డి ఓ లు, ఎండి వోలతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,31,436 ఎకరాలలో ఆక్వా సాగు జరుగుతుందని, ఇప్పటివరకు 66,340ఎకరాలు అప్సడాలో రిజిస్ట్రేషన్ జరిగిందని, 39,413 ఎకరాలు అప్సడలో రిజిస్టర్ కావలసి ఉందన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నాటికి నూరు శాతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించాలని మత్స్యశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అప్సడా రిజిస్ట్రేషన్ ద్వారా కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకమైన స్లైడ్స్ తయారు చేయడం జరిగిందని, వాటి ద్వారా అధికారులు రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అప్సడా రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల ఉత్పత్తులకు మాత్రమే విదేశాలు అనుమతించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా చిన్న, పెద్ద రైతులందరికీ విద్యుత్ రాయితీ లభిస్తుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు మాత్రమే నష్టపరిహారం లభిస్తుంది అన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా లభించే ప్రయోజనాలపై తయారుచేసిన స్లైడ్స్ ను అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతిరోజు 2 వేల ఎకరాలకు పైబడి రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. అప్సడా రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్ధ అనుమతి, ప్రభుత్వ పథకాల లబ్ధి, వివాదాల నివారణ వంటి ప్రయోజనాలు కలుగుతాయని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ఈపిటిఎస్ పోర్టల్ లో ఫైల్స్ అప్లోడింగ్ పై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. కార్యాలయాల్లో ప్రతి ఫైలును ఇపిటిఎస్ పోర్టల్ లో అప్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు జిల్లాలో రానున్న ఉగాది నాటికి 9,135 గృహాలు లబ్ధిదారులకు అందించాల్సి ఉందని, యుద్ధ ప్రాతిపదికన గృహ నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ గూగుల్ మీట్ లో మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ సురేష్, సహాయ సంచాలకులు ఎల్ఎల్ రాజు, ఎంపీడీవోలు, ఎఫ్డిఓలు, తదితరులు పాల్గొన్నారు.