Close

కొల్లేటి సరస్సు

Publish Date : 24/03/2018

kolleru lakeఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు – కొల్లేరు. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం.ఇక్కడకు వలసవచ్చే పక్షులలో ముఖ్యమైనవి – పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి.

గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలుకలు నీటిని చేరుస్తున్నాయి.

kolleru lakeకోల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెలుతుంది.సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతం చేరుతుంది. కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉంది.

పురాతన గ్రంధాలలో కొల్లేరు ప్రస్తావన

రామాయణం అరణ్యకాండలో వర్ణింపబడిన పెద్ద సరస్సు కొల్లేరే నని ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడయిన చిలుకూరి వీరభద్రరావు భావించాడు. ఈ విషయమై “ఆంధ్రుల చరిత్రము – ప్రథమ భాగము”లో ఇలా వ్రాశాడు.

ఈ దండకారణ్య మధ్యమున యోజనాయుతమైన (100 చతురపు మైళ్ళ వైశాల్యము గల) మహా సరస్సొకటి గలదనియు, అది జల విహంగములతో నత్యంత రమణీయమై యొప్పుచున్నదనియు …. ఆప్రదేశమంత నిర్జంతుకముగా నున్నదనియు నగస్త్యుడు శ్రీరామ చంద్రునితో జెప్పినట్లు రామాయణమున చెప్పబడినది…. ఈ సరస్సెక్కడనున్నదని విచారింపగా నయ్యది యాంధ్ర దేశములోనిదిగా జూపట్టుచున్నది.

ఏమన గొప్పదై దండకారణ్య మధ్యగతమై కొంగలకాకరమై యుండు తియ్యని కొలను మన యాంధ్ర దేశముననే గాని మఱియెచ్చటను గానరాదు.మఱియు దండియను మహాకవి తన దశకుమార చరిత్రములో నీ యాంధ్రదేశము నభివర్ణించుచు నిందొక మహా సరస్సు గలదనియు నది సారస నిలయమనియు నది యాంధ్రనగరికి ననతి దూరముగా నున్నదనియు బేర్కొని యుండుటచేత నట్లభివర్ణింపబడిన కొలను కొల్లేరు గాక మఱియొక్కటి కానేరదు. (ఆంధ్ర నగరి యనగా వేంగి కావచ్చునని చిలుకూరి వీరభద్రరావు అభిప్రాయం). “కొల్లేటికొంగ” యను లోకోక్తియె కొల్లేరు కొంగలకు ప్రసిద్ధమను విషయమును వేనోళ్ళ జాటుచున్నది. దక్షిణ హిందూస్థానమున నెన్నందగిన పెద్ద తియ్య నీటికొలను “కొల్లేరు” మాత్రమేయై దండి చెప్పినట్లుగా జలరాశి.