ఏలూరు, 08.09.2021 పత్రికా ప్రకటన విద్యార్థులకు అందిస్తున్న రోజువారీ మధ్యాహ్న భోజన మెనూ నాణ్యతా ప్రమాణాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

భీమడోలు మండలం గుండుగొలనులో మావులేటి సోమరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నాడు – నేడు కార్యక్రమంలో పాఠశాలలో అభివృద్ధి చేసిన మౌలిక వసతులను పరిశీలించారు. పరిసరాలను పరిశీలించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తున్న పాఠ్యాంశాలను కలెక్టర్ విద్యార్థులతో మమేకమై ఆసక్తిగా విన్నారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా….
ఇటీవల దాతల సహకారంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన భోజనశాలను పరిశీలించారు. వంటశాలలో పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి భుజించి సంతృప్తి వ్యక్తం చేశారు. బోజనశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ప్రతీవారం అందిస్తున్న మెనూవివరాలను పరిశీలించారు. నేటి బుధవారం మెనూ అయిన వెజిటబుల్ బిర్యాని, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, వేరుశనగ చిక్కీల రుచిని విద్యార్థులతో కలిసి కలెక్టర్ కార్తికేయ మిశ్రా భుజించి భోజనం ఎలాఉంది,….ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనాలు ఉంటున్నాయా… అని అడిగి తెలుసుకున్నారు.
తాను తిన్న ఆహార పళ్ళాన్ని స్వయంగా శుభ్రం చేసిన కలెక్టర్….
విద్యార్థులతో కలిసి భోజనం చేయడమే కాకుండా ఆయన భుజించిన పళ్ళాన్ని కూడా స్వయంగా శుభ్రం చేసారు.
అనంతరం విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించే బియ్యం, కూరగాయలు, కోడి గుడ్లు, ఇతర సరుకులను సకాలంలో అందేలా సంబంధిత ఏజెన్సీలను కోరాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు.
ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ తోపాటు జిల్లా విద్యాశాఖాధికారి సి.వి రేణుక, మిడ్ డే మీల్ అసిస్టెంట్ డైరెక్టర్ వరదాచార్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారపాటి సునీత, ఉన్నారు.
సమాచార శాఖ ఏలూరు వారిచే జారీ చేయడమైనది.