Close

ఏలూరు , 05-02-2022: ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో జిల్లాలోని పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యం రోడ్ల నిర్వహణ, గ్రీనరీ అంశాలలో కనిపించేంత మార్పు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ మున్సిపల్ కమీషనర్లకు ఆదేశించారు.

Publish Date : 05/02/2022

పట్టణాభివృద్ధిపై సమీక్షించిన కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్

పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యంపై చర్చ కనిపించేంత మార్పు రావాలి.

ప్రతీ పట్టణంలో ఒక పార్కు అభివృద్ధి చేపట్టాలి

ఏలూరు , ఫిబ్రవరి 5 : ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో జిల్లాలోని పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యం రోడ్ల నిర్వహణ, గ్రీనరీ అంశాలలో కనిపించేంత మార్పు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ మున్సిపల్ కమీషనర్లకు ఆదేశించారు.

స్థానిక కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో శనివారం పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యం, రోడ్ల అభివృద్ధి, క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్), త్రాగునీటి సరఫరా, టిడ్కో ఇళ్ల నిర్మాణం, పన్నుల వసూళ్లు, పేదలందరికీ ఇళ్లు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందే అన్నారు. ఇందుకు రోజువారీ పర్యవేక్షణ ఎంతో అవసరం అన్నారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడం ద్వారా తాము నిర్వర్తించే విధులను సంతృప్తిగా ఆస్వాదించవచ్చునన్నారు.

నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండచడంలో ఆయా మున్సిపాల్టీల మధ్య పోటీతత్వం ఉండాలన్నారు. పట్టణాల్లో రోడ్ల డివైడర్లపై గ్రీనరీని పెంచేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ట్రాఫిక్ రద్దీగా ఉన్న రహదారుల్లో ఆక్రమణలు తొలగించి వెడల్పు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ కార్యక్రమం పటిష్టంగా అమలు కావాలన్నారు. రోడ్ల మరమత్తుకు ప్రాధాన్యతనిచ్చి గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపధికన పూర్తి చేయాలన్నారు. దుమ్ము కాలుష్యాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. మురుగు పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించి ఆయా డ్రైనేజీల్లో పూడికలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పరిశుభ్రతను నెలకొల్పడంతో పాటు కన్స్ట్రక్షన్, డిమాలిషన్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై దృష్టిపెట్టాలన్నారు. ఇంటిగ్రేటెడ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్లపై దృష్టిపెట్టాలన్నారు. చెత్త సేకరణలో భాగంగా ఇళ్లకు ఇచ్చిన గ్రీన్, బ్లూ, రెడ్ కలర్ బిన్ ల వినియోగంపై కలెక్టర్ ఆరా తీశారు. ఇందులో భాగంగా గృహస్తుల నుంచి వసూలు చేసే రుసుంకు సంబంధించి వారికి ఎస్ఎంఎస్ ద్వారా సందేశం వెళ్లేలా చూడాలన్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నియంత్రించేందుకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఏలూరు నగరంతో పాటు అన్ని మున్సిపాల్టీలలో ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలన్నారు. ప్రతీ మున్సిపాల్టీలో పన్నుల వసూళ్లులో పూర్తి పారదర్శకత ఉండాలన్నారు. ఆయా వాణిజ్య, గృహసముదాయాలను పరిశీలించి అనుమతి లేకుండా ఉన్న నిర్మాణాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పన్ను వేసిన విధానాన్ని పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా టాక్స్ ఉంది లేనిది పరిశీలించాలన్నారు. ప్రతీ మున్సిపాల్టీలలో వంతెనలు, ప్లై ఓవర్లు, ఇతర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరిచేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా డ్రైనేజీల్లో పూడిక తీసేందుకు మరొక బృందాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆయా పట్టణాల్లో ఉన్న ప్రైవేటు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసే వాహనదారులు వివరాలను మున్సిపాల్టీలో నమోదు చేసుకోవాలన్నారు. ఆయా మున్సిపాల్టీలలో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కు ప్రత్యేక కాల్ సెంటర్‌ను ప్రారంభించి ఆ కాల్ సెంటర్ ద్వారా మాత్రమే సంబంధిత వాహనదారులు అందుకు వెళ్లవలసి ఉంటుందన్నారు. అంతే గానీ వారు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేసేందుకు ఎంత మాత్రం వీలు లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రతీ మున్సిపాల్టీలో ఒక పార్కును అభివృద్ధిపర్చండి :
ప్రతీ మున్సిపాల్టీ పరిధిలో కనీసం ఒక పార్కును అభివృద్ధి పరిచి రిక్రియేషన్ కార్యకలాపాలు పెంచే దిశగా మున్సిపల్ కమీషనర్లు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు.

కోవిడ్ మూలంగా చాలా మంది సోషల్ లైఫ్ కు దూరంగా ఉన్నారని, ఇటువంటి సమయంలో ప్రతీ మున్సిపాల్టీలో కనీసం ఒక పార్కును అభివృద్ధి పరిచి పిల్లలు ఆడుకునే క్రీడా పరికరాలు, ఓపెన్ జిమ్, గ్రీనరీ అభివృద్ధి పనులను చేపట్టాలన్నారు. ఇదే సమయంలో ఆయా పట్టణాలు, నగరాల్లో కాలువ గట్ల వెంబడి వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి ఎద్దడి లేకుండా అవసరమైన కార్యాచరణను అమలు చేయాలన్నారు. పాలకొల్లు మున్సిపాల్టీలో శాశ్వత ప్రాతిపదికన
త్రాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి పాలకొల్లు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో మొదటి దశ క్రింద ఫ్రిబవరి చివరి నాటికి లబ్దిదారులకు ఇళ్లను అందిస్తున్న సందర్భంలో ఇందుకు సంబంధించి ఈలోపులోనే వారికి నూరుశాతం బ్యాంక్ రుణాలు అందించాలన్నారు.

పేదలందరికీ ఇళ్లు ప్రగతిపై కలెక్టర్ సమీక్షిస్తూ ప్రతీమున్సిపాల్టీలో ఒక లేఅవుట్ లో 50 శాతానికి మించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు నిర్మాణస్థాయిని బట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలకు సొమ్ము జమచేస్తున్నదని ఆయన చెప్పారు. అదేవిధంగా ఇంత వరకు నిర్మాణాలు ప్రారంభం కాని ఇళ్లు నిర్మాణాలు వెంటనే చేపట్టేలా లబ్దిదారులను అవగాహన పర్చాలన్నారు. వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవలు నిర్ధిష్ట కాలపరిమితిలో అందజేయాలన్నారు. అదేవిధంగా స్పందనలో వచ్చిన అర్జీలను కూడా వేగవంతంగా పరిష్కరించాలన్నారు. పరిష్కార తీరులో రీ ఓపెన్ అయ్యే పరిస్థితి ఉండకూడదన్నారు. ఈ నెల 22వ తేదీన జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా ఇందుకు సంబంధించిన రుణాల మంజూరును వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఓటిఎస్ వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ సంబంధించి ఆయా మున్సిపాల్టీల్లో భూసేకరణ సంబందించి ప్రతిపాదనలు వెంటనే పంపాలన్నారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఏలూరు నగర కమిషనర్ చంద్రశేఖర్, మెప్మా పిడి ఇమ్మానుయేల్,జిల్లాలోని వివిధ మున్సిపాల్టీల కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.
__________

సమాచార పౌరసంబంధాల శాఖ ఏలూరు వారిచే జారీ