Close

అక్టోబర్ 18-2022 తాడేపల్లిగూడెం రూరల్ ,చిన్న తాడేపల్లి: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలంలో చిన్న తాడేపల్లి గ్రామ సచివాలయం వద్ద ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు.

Publish Date : 18/10/2022

పత్రిక ప్రకటన
———————————-
అక్టోబర్ 18-2022
తాడేపల్లిగూడెం రూరల్ ,చిన్న తాడేపల్లి:

రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలంలో చిన్న తాడేపల్లి గ్రామ సచివాలయం వద్ద ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీ హెచ్ .అరుణ్ కుమార్ మాట్లాడుతూ. రైతులు మిల్లర్లు, దళారులు వద్ద మోసపోకుండా నేరుగా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. గత సంవత్సరం సాధారణ రకమునకు రూ .1,940 ఉన్న ధాన్యమును 2,040,ఏ గ్రేడ్ కి 1,960 రూపాయలు ఉన్న ధాన్యమునకు 2,060 రూపాయలు ఈ సంవత్సరం మద్దతు ధర కల్పించడం జరిగిందన్నారు. గోనె సంచులు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి నవంబరు నెల నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ క్రాప్ నమోదు చేసుకొని ఈ కె వై సి నమోదు చేయించుకున్న రైతుల వద్దనుండే ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆర్ బి కే నందు గల టెక్నికల్ సిబ్బంది ధాన్యం నాణ్యతను పరిశీలించుటకు రైతు పొలం కల్లం వద్దకు వచ్చి ధాన్యం నాణ్యతను పరిశీలిస్తారని అన్నారు. ఏ రోజు వస్తారో రైతులు ఆ రోజే ఆర్బీకే నుండి కూపన్ కచ్చితంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను అనుసరించి రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు సిబ్బంది పరిశీలిస్తారన్నారు. రైతులు విక్రయించిన దాన్యము వాటి విలువ తదితర వివరములతో కూడిన రసీదు ఎఫ్డీఓ కొనుగోలు సమయంలో ఇవ్వటం జరుగుతుందని వివరించారు .రైతు కచ్చితంగా రసీదు తీసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతుకు 21 రోజులు లోపు వారి ఖాతాలలో డబ్బులు నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ప్రతి జిల్లా కేంద్రంలోనూ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడిందని, టోల్ ఫ్రీ నెంబర్లు ద్వారా సాంప్రదించవచ్చు అన్నారు.

జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో ఉన్న సమస్యలను రాష్ట్రస్థాయిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు .జిల్లాలో ధాన్యం సేకరణ మెరుగ్గా జరగాలన్నారు .ఈ క్రాప్ ద్వారా పంట నెంబర్లు చేసుకున్న రైతులు వద్దనుండే పంటను కొనుగోలు చేస్తామనిపునరుద్ఘాటించారు .అలాగే రైతుల కూడా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ధాన్యం తోలిన తర్వాత సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని, గోని సంచులు కొరత కూడా బాగా ఎక్కువగా ఉందని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. రైతులు ప్రత్యేకమైన పంటల పై కూడా మొగ్గు చూపాలని అన్నారు. మనం అవసరానికి మించి వరి పండించటం వలన ఈ ఇబ్బంది కలుగుతుందన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన దాన్యము వివరాలను ప్రజలకు తెలిసేలా రైతు భరోసా కేంద్రాలలో పెడతామన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి ముత్యాల ఆంజనేయులు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ముప్పూడి వెంకటేశ్వర రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ వెంకటేశ్వర్లు,సివిల్ సప్లై మేనేజర్ శివప్రసాద్,డిఎస్ఓ సరోజ ,అగ్రికల్చ ఏడి.మురళీకృష్ణ, ఎమ్మార్వో అప్పారావు ఎండిఓ ఎం వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
—————————————-
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ -భీమవరం నుండి జారి